State level Athletics | కొత్తపల్లి(కరీంనగర్) సెప్టెంబర్ 30: కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో శనివారం 9వ సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 66 మంది కోచ్‌లు, 45 టెక్నికల్ ఆఫీషియల్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాల బాలికలకు, పురుషులు, మహిళలకు ఈ క్రీడలునిర్వహిస్తున్నారు.
తొలిరోజు 20, 10వేల మీటర్ల రేస్‌వాక్, షార్ట్ఫుట్, లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్ త్రో, 100, 200 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. రెండోరోజు ఆదివారం హార్డిల్స్, హ్యామర్‌త్రో, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అక్టోబర్ చివరివారంలో వరంగల్ పట్టణంలో జరిగే సౌత్‌జోన్ క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అంతర్జాతీయస్థాయి ఫోటో ఫినిష్ టెక్నాలజీని ఈ పోటీల నిర్వహణలో వినియోగిస్తున్నారు.
ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొంటారు. పోటీల ను రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి పర్యవేక్షిస్తున్నారు.