హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం అర్ధరాత్రి 2021కి వీడ్కోలు పలికిన ప్రజలు.. కేక్‌లు కట్‌చేసి జోష్‌తో 2022 సంవత్సరానికి స్వాగతం పలికారు. రాత్రంతా సంబురాల్లో మునిగితేలి.. శనివారం ఉదయం ఆలయాలకు క్యూకట్టారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఏడాదంతా శుభం జరగాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బిర్లామందిర్, చిలుకూరు బాలాజీ, సంఘీ టెంపుల్, యాదాద్రి నారసింహుడి ఆలయం, వరంగల్‌లోని వేయి స్తంభాలగుడి, భద్రకాళి ఆలయం, రామప్ప టెంపుల్, బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయం, భద్రాచలం రాములవారి ఆలయం, మహబూబ్‌నగర్ బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.