హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ ప్రాంతంరూపాంతరం చెందిన రోజు (సెప్టెంబర్ 17)ను పురష్కరించుకొని ప్రభుత్వం సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఫ్రభుత్వాన్ని కోరారు. 1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ర్టానికి నిజాం రాచరిక పాలన నుంచి స్వాతంత్య్రం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో కలిసిందని గుర్తుచేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఏడాదిపాటు నిర్వహించినట్టే తెలంగాణలో కూడా ఏడాదిపాటు విలీన వజ్రోత్సవాలు నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. నెహ్రూ, పటేల్‌తోపాటు తెలంగాణ విముక్తి కోసం పోరాడిన స్వామి రామనందతీర్థ, సర్దార్ జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, చాకలి ఐలమ్మ, రావినారాయణరెడ్డి, ఆరుట్ల కమలమ్మ మొదలైనవారిని గౌరవించుకొనేలా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు.