హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంంగాణ సాయుధ పోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి (చిట్యాల) ఐలమ్మ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు. అన్యాయాన్ని, అవమానాన్ని సహించం, భరించబోమని విసునూరు దొరకు ఎదురుతిరిగిన వీరవనిత ఐలమ్మ అని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ నాడు కష్టపడి పండించిన పంట మీద, పొలం మీద విస్నూరు దొర మూకలు చేసిన దాడిని తిప్పికొట్టిన వీరనారి ఐలమ్మ అని గుర్తుచేశారు.
ఆనాటి సామాజిక స్థితిగతుల నుంచి దొడ్డి కొమురయ్య, కాళోజీ నారాయణరావు, జయశంకర్ సార్ వంటి వారి స్ఫూర్తితో తెలంగాణను ఏకం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని అమరుల ఆత్మలు కూడా దీవించాయని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీటి రంగంలో, విద్య, వైద్యం, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. అలాంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనాటి విస్నూరు దొర తరహాలో అణచివేతను కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలపై చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెడితే రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే తగిన మూల్యం తప్పదని, అమరుల ఆత్మలు ప్రజలను ఆవహిస్తే ఆయన మసై పోతారని హెచ్చరించారు.
అస్తిత్వ పతాక ఐలమ్మ: దేవీప్రసాద్
తెలంగాణ అస్తిత్వ పతాక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనితకు బీఆర్ఎస్ తరఫున వినమ్రంగా నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు. నేటికీ దేశవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోతున్నాయని, రెండు జాతీయ పార్టీలు బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటమే ఐలమ్మకు మనమిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, చిరుమళ్ల రాకేశ్, పార్టీ నేతలు గాంధీనాయక్, రాజేశ్వర్‌రావు, ఉపేంద్ర, సుమిత్ర ఆనంద్, కాంబోజు వెంక టేశ్వర్లు, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి
వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంత్యుత్సవాలు బీసీ సంక్షేమశాఖ, రజక, బీసీ సంఘాల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కొనసాగాయి. ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో హకుల సాధన కోసం కొట్లాడిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని కొనియాడారు. రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యం లో వేడుకలను నిర్వహించగా మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఆయా చోట్ల ప్రజాసంఘాలు, బీసీ, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.