హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ఆదివారం డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య రెవెన్యూ ఉద్యోగులు వారధులుగా పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో ప్రతి గ్రామంలో వీఆర్వో లేదా వీఏవో ఉండేవారని గుర్తు చేశారు. సంస్కరణల పేరు తో వారి ఉనికి లేకుండా చేశారని విమర్శించారు. ప్రతి గ్రామంలో ఒక ప్రతినిధిని నియమిస్తామని చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులకు 5వ తేదీలోపే వేతనాలు పడేలా చూస్తామని తెలిపారు. ధరణి లోపాలను సరిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సెక్రటరీ జనరల్ రమేశ్‌రాథోడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, పద్మప్రియ, టీజీటీఏ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ హాన్, ఆరేటి రాజేశ్వర్, శ్రీనివాస్ శంకర్, పుష్యమి, ఎస్పీఆర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.