Grama Panchayati | నమస్తే తెలంగాణ నెట్వర్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట రెండు రోజుల టోకెన్ సమ్మెను ప్రారంభించారు.
తెలంగాణ జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏ సీ నాయకుల పిలుపు మేరకు సమ్మెను చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు అమలుచేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పం దించకుంటే జనవరి 4 తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు హెచ్చరించారు. టోకెన్ సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.