నమస్తే తెలంగాణ,ఉమ్మడి ఖమ్మం జిల్లా నెట్వర్క్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మక్కజొన్నలను కాపాడుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాలకు దెబ్బతినడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ముత్తగూడెం, తిరుమలాయపాలెం, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, కూసుమంచి, దమ్మపేట, పాల్వంచ తదితర మండలాల్లోని రైతులు కన్నీరు పెడుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే పంటలను కొనేందుకు ప్రభుత్వానికి అసలు ఇష్టమే లేదన్నట్టుగా కనిపిస్తున్నది. అరకొరగా పంటలను కొంటున్నా.. ‘తరలించేందుకు లారీలు లేవు.. నిల్వ చేసేందుకు గోదాములు లేవు.. హమాలీలు లేరు.. బస్తాలు లేవు’ అంటూ సర్కార్ చేతగానిమాటలు చెబుతూ కాలహరణం చేస్తూ రైతన్నల వెన్ను విరుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతన్నలు పంటలు పండించడం కంటే వాటిని అమ్ముకునేందుకే ఎక్కువ తిప్పలు పడుతున్నారు. ధాన్యం, మక్కజొన్నల కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.