నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): సాధారణంగా ఒక సమస్యపై ప్ర జాప్రతినిధి సమీక్ష చేస్తుంటే.. ఇక పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమై న పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మె ల్యే మీటింగ్ తర్వాత ధాన్యం ధర అమాంతం పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌కు సగటున రూ.300 వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు వారాలుగా మార్కెట్లకు సన్నధాన్యం వస్తున్నది. ఎక్కువ మంది నేరుగా పొలాల నుంచి ధాన్యం తెచ్చి మిర్యాలగూడలోని రైస్ మిల్లర్లకు అమ్ముతుంటారు. ఇక్కడ సన్నధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లులు 80కి పైగా ఉండటమే ఇందుకు కా రణం. ప్రతి సీజన్లో ఇక్కడి రైస్‌మిల్లులే ఆరేడు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేస్తుంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలోని సన్నాల రైతులు మిర్యాలగూడ ప్రాంతానికే వచ్చి ధా న్యాన్ని విక్రయిస్తుంటారు.
ఈ యాసంగిలో గత నెల మూడో వారం నుంచి మిల్లులకు సన్నధాన్యం రాక మొదలైం ది. ప్రస్తుతం సన్నబియ్యానికి మంచి డిమాం డ్ ఉండడంతో మిల్లర్లు సైతం మొదటినుంచి మంచి ధరే నిర్ణయించారు. క్వింటాల్‌కు రూ.2,550 నుంచి రూ.2,750 వరకు చెల్లిం చి కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు. ఇలా రోజుకు ఆరేడు వందల ట్రాక్టర్ల సన్నాలను రైతులు మంచి ధరకే విక్రయించినట్టు చెప్తున్నారు.
కానీ, బుధవారం నుంచి అమాం తం పడిపోయింది. రూ.200 నుంచి 500 వరకు తగ్గించేశారని వాపోతున్నారు. మిల్లర్లతో సమావేశం మరునాటి నుంచే ధర పడిపోయిందని ఆరోపిస్తున్నారు. బుధవారం క్వింటాల్‌కు 2,200 నుంచి 2,500 వరకు మాత్రమే చెల్లించినట్టు చెప్తున్నారు. ఏ రైస్‌మిల్లుకు వెళ్లినా ఇదే ధర చెప్తున్నారని రైతులు తెలిపారు. రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి నిలువుదోపిడీ చేశారని మండిపడుతున్నారు. గురువారం కూడా దాదాపు వెయ్యి ట్రాక్టర్లలో సన్నధాన్యం మిల్లుల వద్దకు రాగా గరిష్ఠంగా 2,500 మాత్రమే చెల్లించినట్టు చెప్తున్నారు.
రైస్‌మిల్లర్లతో ఎమ్మెల్యే సమావేశం తర్వాత ధాన్యం ధరలు తగ్గడం స్థానికంగా కలకలం రే పుతున్నది. వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా వస్తుంది. కానీ, సన్నవడ్లకు ఉండే ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడి రైతులు నేరుగా రైస్ మిల్లర్లకు అమ్ముతారు. మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో మిల్లర్లు మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు.
ఎమ్మెల్యేతో జరిగిన సమావేశంలో సన్నాల ధర చర్చకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మీటింగ్ తర్వాత ‘రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లర్లను ఎమ్మెల్యే ఆదేశించారు’ అని ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మిల్లర్లు ఇలా రైతులకు కోతపెట్టి, ‘పెద్దల’కు లెక్కలు సమకూర్చుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుసంఘం నేతలు బుధవారం ఆందోళనకు దిగారు. మిల్లర్ల సిండికేట్ దోపిడీపై స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.