MLC counting : ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్లగొండ పట్టణ శివారులోగల ఎ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని నాలుగు కౌంటింగ్ హాల్స్‌లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు.
నాలుగు కౌంటింగ్ హాల్స్‌లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇస్తున్నారు. సిబ్బంది వాటిని టేబుల్‌పై కుప్పగా పోసి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కిస్తారు. బండిల్ కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు.
తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత వస్తుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కిందినుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు.
అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్‌కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. కానీ ఇంతవరకు తృతీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.