GATE 2025 | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తున్నది.
8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, సీఎస్ఈ పేపర్‌కు హాజరయ్యేందుకు 1.6లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో 11 పట్టణాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరడానికి వీలుంటుంది. అంతే కాకుండామూడేండ్లపాటు 32 కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల ఇంటర్యూలకు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.