ములుగురూరల్, ఫిబ్రవరి13: ప్రాంక్ మోజులో పడి ఓ జీపీ కార్యదర్శి ఆడ వేషంలో పలు వీధుల్లో తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బీ వేణుగోపాల్ ఆడవేషంలో ములుగుకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద పలువురిని ఆడవేషంలో ప్రాంక్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో స్థానికులు ఆడవేషంలో ఉన్నది మగ వ్యక్తి అని, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఆడవేషంలో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా జీపీ కార్యదర్శి వేణుగోపాల్‌గా తేలింది. వృత్తి రీత్యా గుమ్మలపల్లి జీపీ కార్యదర్శిగా పనిచేస్తూ అప్పుడప్పుడు ఆడవేషంలో ప్రాంక్ చేయడం సరదాగా మార్చుకున్నాడు. సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఎస్సై తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలా ఆడవేషంలో ప్రాంక్‌లు చేయడం ఏమిటని మందలించామని, మళ్లీ ఇలా ప్రవర్తించకుండా కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్సై వెంకటేశ్వర్ వివరించారు.