హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉంటామని స్పష్టంచేశారు. శుక్రవారం రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, రాష్ట్ర కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో 17 ముఖ్య గౌడ సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిశారు. సీఎం కేసీఆర్.. గౌడ్ల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నందున కృతజ్ఞతగా మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
కులవృత్తుల ఆత్మగౌరవం
బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ పార్టీయేనని గౌడ సంఘాల నాయకులు అన్నారు. గత ప్రభుత్వాలు కల్లు దుకాణాలు మూసివేయడం, కులవృత్తిని సోదాల పేరిట అడ్డుకొనేవని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, శ్రీనివాస్‌గౌడ్ ఆబ్కారీశాఖ మంత్రిగా అయ్యాక గౌడ కులస్థుల్లో మరింత భరోసా పెరిగిందన్నారు. రైతుల నుంచి అన్ని కుల వృత్తులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాయని, అందుకే తామంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంక్షేమానికి పాటుపడుతున్నందున మునుగోడులోని గౌడ్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్కు రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా ముఖ్య కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించేలా కృషి చేయాలని మంత్రిని కోరారు.
గౌడల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ చర్యలు: శ్రీనివాస్‌గౌడ్
కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రైతులు అన్నా, కులవృత్తులు అన్నా కేసీఆర్‌కు ఎంతో అభిమానమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేత్వత్వంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. కల్లు దుకాణాలకు లైనెస్స్ బకాయిల రద్దు, నీరా పాలసీ, నీరా కేఫ్ ఏర్పాటు, వైన్స్‌ల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. కోకాపేటలో రూ.500 కోట్ల విలువైన భూమిని పాపన్న ట్రస్ట్‌కు అప్పగించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అన్ని బీసీ వర్గాలకు, అగ్రవర్ణ పేదలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ఇక ముందు కూడా తెలంగాణలోని అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తుందని వెల్లడించారు. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరమని పేర్కొన్నారు.
మంత్రిని కలిసి మద్దతు తెలిపినవారు..
గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐయిలి వెంకన్నగౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్, మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డమీది విజయ్‌కుమార్‌గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం సత్తయ్యగౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కి వీరస్వామిగౌడ్, తెలుగునాడు గీతకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోయెడ స్వామిగౌడ్, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, అఖిలభారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురెల్ల వేములయ్యగౌడ్, యాదాద్రి గౌడ ట్రస్ట్ హరిచరణ్‌గౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, తెలంగాణ గౌడ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డమీది అనురాధగౌడ్, గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముఖేశ్‌గౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సదానందంగౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ మల్లేశ్‌గౌడ్, కల్లుగీతకార్మిక సంఘం ప్రభాకర్‌గౌడ్, కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి మద్దతు తెలిపారు.