హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పోలీసు పోస్టుల నియామక ప్రక్రియలో ఎన్సీసీ కోటా నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సై, అగ్నిమాపక శాఖ, డిప్యూటీ జైలర్ తదితర పోలీసు పోస్టుల నియమాక ప్రక్రియలో ఎన్సీసీ కోటాను, ఏ, బీ, సీ సర్టిఫికెట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికెట్లను సమానంగా పరిగణించి మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ప్రభుత్వం జారీచేసిన జీవో 14 సబబేనని చెప్పింది. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారి అర్హతను నిర్ణయించే అధికారం పోలీస్ నియామక మండలి పరిధిలోనే ఉందని పేర్కొంది. ఈ తరహా నియామకాలు 2015లో వెలువడిన నోటిఫికేషన్లో అమలు చేయలేదన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ఏ కంటే బీ, బీ కంటే సీ క్యాటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్యులర్ కేవలం సూచన మాత్రమేనని తెలిపింది. చట్టప్రకారం ఎన్సీసీకి మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని విస్మరించకూడదని పేర్కొంది.