హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌ల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.1.44 కోట్లతో చర్యలు చేపట్టింది. నిరుడు కడెం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డుస్థాయిలో 5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చిన విషయం తెలిసిందే. ఉధృత వరద నేపథ్యంలో ప్రాజెక్టు స్పిల్‌వేలో 11వ నంబర్ గేట్ దెబ్బతిన్నది. డివైడింగ్ వాల్‌తోపాటు, ఆప్రాన్ పోర్షన్ కూడా కొన్నిచోట్ల ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మరమ్మతులకు రూ.1.44కోట్లతో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం) అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం బుధవారం అనుమతులు మంజూరు చేసింది. కడెంతోపాటు ఇతర డ్యామ్‌ల పరిరక్షణకు సర్కారు నడుం బిగించింది. ఇప్పటికే రూ.75 కోట్లతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టింది. క్రస్ట్‌గేట్ల పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ గేట్ల రోప్స్‌ను కూడా మార్చుతున్నది. జురాల ప్రాజెక్టు మరమ్మతులను కూడా చేపట్టినట్టు ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు వెల్లడించారు.
ఇప్పటికే ఇరిగేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగం ఈ ఏడాదికి సంబంధించి 44 పనులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.11 కోట్ల అంచనా వ్యయంతో మరో 39 పనులను చేపట్టేందుకు ఇటీవల నిర్వహించిన ఓఅండ్ఎం కమిటీ ఆమోదం తెలిపిందని ఈఎన్సీ నాగేందర్రావు వెల్లడించారు. ప్రధానంగా లక్నవరం చెరువు 3 చానళ్లతోపాటు, స్వర్ణ, సుద్దవాగు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వజీరాబాద్ డిస్ట్రిబ్యూటరీ, కాకతీయ కెనాల్ నుంచి కేసముద్రానికి సాగునీటిని అందించే డీబీఎం 48, రాజోలిబండ డైవర్షన్ స్కీంలలో పలు పనులను చేపట్టనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సాగునీటి వృథాను అరికట్టడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పూర్తయిన పనులను వెంటనే చేపట్టి సీజన్ ఆరంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.