హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఢంకా బజాయిం చి చెప్పారు.. అమల్లో మాత్రం తాత్సారం చేస్తూ మాదిగలను మోసం చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎస్సీ స్థానాల్లో రెండింటిలో మాలలు, ఒకటి బైండ్ల సామాజిక వర్గానికి ఇచ్చి మాదిగలకు మెండిచెయ్యి చూపారని విమర్శించారు. మంత్రివర్గంలో నూ మాదిగలకు చోటివ్వలేదని ధ్వజమెత్తా రు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సుంకె రవిశంకర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తనతోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టించి చిత్తశుద్ధిని చాటుకున్నారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణలోనే వర్గీకరణను అమలుచేస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని తెలిపారు. 65 రోజులవుతున్నా ఆచరణకు ఉపక్రమించనే లేదని తెలిపారు.
అగ్రవర్ణానికి చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా ఉపసంఘం ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. వర్గీకరణను పక్కనబెట్టి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూ మాదిగ బిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ చేసేదాకా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయవద్దని డిమాండ్ చేశారు.
హైడ్రా అమలు కోసం ఆర్డినెన్స్ తెచ్చిన రేవంత్ సర్కారు ఎస్సీ వర్గీకరణపై ఎందుకు తేలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగితే డీఎస్సీలో 1,200 ఉద్యోగాలు మాదిగలకు వచ్చేవని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాదిగ ద్రోహిగా మారారని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తేకుండా, మంత్రివర్గంలో మాదిగలకు చోటుకల్పించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ద్రోహం చేశారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్జీటీ పోస్టుల్లో ఆరు ఉంటే ఐదు మాలలకు రాగా, ఒకటే మాదిగలకు వచ్చిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు జాతీయస్థాయి ఉద్యమానికి సైతం సిద్ధమేనని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానాన్ని స్పష్టంచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలయ్యాక వర్గీకరణ జరిగితే ఏమి లాభమని ప్రశ్నించారు. మాదిగల వాటా తేల్చి నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు నోరు విప్పాలని, ఎస్సీ వర్గీకరణపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎకడికకడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాదిగల ఉద్యమానికి బీఆర్ఎస్, కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు.