హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పనిచేస్తున్నాం.. వేతనం ఇస్తారా?’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆగస్టు 31న ప్రచురితమైన ప్రత్యేక కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 2,600 మంది ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగిస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులను జా రీ చేసింది. వీరిలో 945 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో, 1,562 మంది ఔట్ సోర్సింగ్, 93 మంది ఎంటీఎస్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నారు.
ఈ ఆర్థి క సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల కొ నసాగింపు ఉత్తర్వులు రావాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ పేరిట మూడు నెలల కొనసాగింపుతో జారీ అయిన ఉత్తర్వులు జూన్తోనే ము గిశాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఉత్తర్వులు లేకున్నా పనిచేయాల్సి వచ్చింది. దీంతో చేసిన పనికి వేతనం వస్తుందో.. లేదో? అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. వారి వేదనను వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తంచేసింది.