‘పోలీసులను కాపాడుకోవటమే నా ధ్యేయం.. వారికి కష్టమొస్తే నేను కన్నీటి బొట్టునవుతా..’ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తు సీఎం అన్న మాటలు నీటి మూటలుగా మారాయి. మీకు నేనున్నానని చెప్పిన మూడ్రోజులకే ‘పోలీసు ఆరోగ్య భద్రత’ పథకాన్ని అటకెక్కించే ఏర్పాట్లు జరిగాయి. ‘పోలీసు ఆరోగ్య భద్రత’ కార్డు అంటేనే దవాఖానలో వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్లాది రూపాయిల బకాయిలను దవాఖానలకు చెల్లించకపోవడం, పోలీసుల నుంచి వసూలు చేసే నెలకు రూ.200 ఎటూ సరిపోకపోవడంతో.. మీ డబ్బులతో మీరే వైద్యం చేయించుకొమ్మని పోలీసు ఆరోగ్య భద్రతా విభాగం చేతులెత్తేసింది. ఈ మేరకు ఇటీవల ఓ నోట్‌ను విడుదల చేసింది.
పోలీసు సిబ్బంది ద్వారా వసూలు చేసే డబ్బులు ఆఫీసు నిర్వహణకే సరిపోతున్నాయని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో దవాఖానలు చికిత్సకు నిరాకరిస్తున్నాయని పేర్కొన్నది. ఈ విషయంలో తామేమీ చేయలేమంటూ ఆరోగ్య భద్రతా విభాగం చేతులెత్తేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆ నోట్ పోలీసు సర్కిల్లో వైరల్ అవుతుండటంతో బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ‘పోలీసులకు ఇక ఆరోగ్య భద్రత కష్టమేనా..? ఇప్పుడు వైద్యం ఎలా? డబ్బులు ఎక్కడ్నుంచి తీసుకురావాలి?’ అంటూ పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇప్పటికే ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారు సైతం తీవ్ర నైరాశ్యానికి లోనవుతున్నారు. కాగా, ఇటీవల ఆరోగ్య భద్రత అందక యశోదా దవాఖానలో ఓ ఏఆర్ ఎస్సై మరణించారు. ఈ ఘటనలో తమకు వైద్యం ఎందుకు చేయరు? ఆస్పత్రులకు డబ్బులు ఎందుకు చెల్లించరు? మేము కట్టే డబ్బులతోనైనా వైద్యం చేయరా? అంటూ నిలదీసిన ఓ పోలీసును ఆదిలాబాద్ అడవులకు బదిలీ చేశారు. వరుస ఘటనల తర్వాత పోలీసుల వైద్యానికి డబ్బుల్లేవని సాక్షాత్తూ బోర్డే చెప్పడంతో పోలీసులు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. వాస్తవాలను అందరికీ వివరించాలనే ఉద్దేశంతోనే సర్క్యులర్‌ను విడుదల చేసినట్టు సమాచారం.