హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్ష పేపర్ లీకేజ్ కేసును ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)కు అప్పగించింది. కేసులో లోతైన దర్యాప్తు నిర్వహించేందుకు సిట్‌కు అప్పగిస్తూ మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే అనుమానంతో శనివారం టీఎస్పీఎస్సీ బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టి ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్ష పత్రం లీక్ అయినట్టు తేల్చారు. దీనికి బాధ్యులైన 9 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్తతో కలిసి లీక్ చేసినట్టు గుర్తించారు. ఈ నలుగురితోపాటు మరో ఐదుగురిని సోమవారం బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది సంచలనాత్మకమైన కేసు కావడంతో లోతైన దర్యాప్తు నిర్వహించేందుకు నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్‌కు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏఆర్ శ్రీనివాస్, మంగళవారం సాయంత్రం సీసీఎస్ డీసీపీ స్నేహామెహ్రాతో కలిసి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు వివరాలను ఆరా తీశారు. బేగంబజార్ నుంచి కేసు సీసీఎస్‌కు బదిలీ కాగానే, అక్కడ కేసు నమోదు చేసి సిట్ లోతుగా దర్యాప్తు జరుపనున్నది.
నిందితులకు 14 రోజుల రిమాండ్
లీకేజ్ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాక్య, రాజేశ్వర్, కేతావత్ నీలేశ్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేందర్ నాయక్‌కు మంగళవారం ఉస్మానియా దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బేగంబజార్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 9 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు. వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నది.