హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఇచ్చే ‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024’ జాబితాను రాజ్‌భవన్ సోమవారం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది నవంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా, 594 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నది. వీటిని పరిశీలించిన అనంతరం ఎనిమిది మంది వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. రూ.2లక్షల నగదు, జ్ఞాపికను అందజేస్తారు.
ఎంపికైన వారు వీరే..
పర్యావరణ సంరక్షణ విభాగంలో దుశర్ల సత్యనారాయణ, ధ్రువాంశు ఆర్గనైజేషన్, దివ్యాంగుల సంక్షేమ విభాగంలో అరికపూడి రఘు, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన, క్రీడా విభాగంలో పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జివాంజీ, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సాంస్కృతిక విభాగంలో ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, పీబీ కృష్ణభారతి(సంయుక్తంగా), సంస్కృతి ఫౌండేషన్‌కు పురస్కారాలు ఇవ్వనున్నట్టు రాజ్‌భవన్ తెలిపింది.