హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. వారంతా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి అక్కడే తేనీటి విందు స్వీకరించారు.
మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మె ల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ బూట్లు వేసుకుని జాతీయ జెండా ఎత్తబోయారు. కలెక్టర్ అటెండర్ సూచనతో తేరుకొన్న విప్.. షూస్విప్పి జెండావిష్కరించారు.
జనగామ, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌కు అవమానం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల ఐలయ్య, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కలెక్టర్ షేక్‌రిజ్వాన్‌బాషా వేదిక ఎక్కుతున్నారు. పట్టణ ప్రథమ మహిళ, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునను ‘మీకు ప్రొటోకాల్ లేదు’ అని పోలీసులు అడ్డుకోగా, ఎమ్మెల్యే పల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సూచనతో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ సైతం వేదిక పక్కకు వెళ్లి కూర్చోవాలంటూ చెప్పారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 15: పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తన షర్ట్‌పై జాతీయజెండా స్టిక్కర్‌ను తలకిందులుగా ధరించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జాతీయ జెండావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు స్వాగతం పలికే క్రమంలో కళాశాల సిబ్బంది జెండా స్టిక్కర్‌ను ఇలా తలకిందులుగా పెట్టారు. ఆయన దానిని గమనించకుండా జాతీయ జెండాను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.
బాన్సువాడ, ఆగస్టు 15: బాన్సువాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవమానకర ఘటన చోటుచేసుకుంది. జెండావిష్కరణకు వచ్చిన ఆర్డీవో.. జెండా గద్దె సమీపంలో బూట్లు వదిలారు. దీంతో అటెండర్ వచ్చి ఆర్డీవో బూట్లను తీసి పక్కన పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారి బూట్లను అటెండర్ మోయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆర్డీవోను వివరణ కోరగా స్పందించలేదు.