హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆర్థిక అవకతవకల కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన్ను నేరుగా ఎమ్మెల్సీగా ఆమోదించేందుకు అంగీకరించలేదని తెలిసింది. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ తేల్చిచెప్పినట్టు తెలిసింది. అజారుద్దీన్‌కు మరో 10రోజులే డెడ్‌లైన్ ఉన్నది. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈలోగా ఎమ్మెల్సీ కావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గవర్నర్‌తో భేటీ అయినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో ముద్దసాని కోదండరాంరెడ్డి, మహ్మద్ అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్‌కు పంపింది. ఈ ఇద్దరు పేర్లను ఆమోదించాల్సిందిగా రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను అభ్యర్థించినట్టు తెలిసింది.
10 రోజులే డెడ్‌లైన్
నిరుడు అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే కచ్చితంగా ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌కు ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుంది. ఈలోగా ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు.
ఫ్లీజ్.. జర చూడండి సార్!
ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇద్దరి ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మంత్రివర్గం అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి.. మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది కానీ, విషయం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తెలంగాణలో ఎమ్మెల్సీల ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డుకావని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్ క్లియరెన్స్ కోసం సీఎం, గవర్నర్‌ను కలిసినట్టు సమాచారం.
ఈడీ కేసుల మీద న్యాయ సలహా..
ఇద్దరు ఎమ్మెల్సీల్లో కోదండరాం పేరును ఆమోదించేందుకు గవర్నర్ సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అజారుద్దీన్ విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఏసీబీ కేసు నమోదైందని, మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని గవర్నర్ కార్యాలయం గుర్తించినట్టు తెలిసింది. రూ.3.8కోట్ల ఆర్థిక అవకతవకల మీద ఈడీ విచారణ ఎదుర్కొని, ఇదే కేసులో ఆయనపై చార్జ్‌షీట్ ఉన్నదని గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైల్‌ను న్యాయసమీక్షకు పంపినట్టు తెలిసింది. న్యాయనిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.