హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం కోసం పునాదులను పటిష్టపర్చడంతోపాటు పరిమితిలేని అవకాశాలు గల భవిష్యత్తు దిశగా తెలంగాణ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసాను రూ.12 వేలకు పెంచడమే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.12వేల చొప్పున సమకూర్చుతున్నట్టు తెలిపారు.. బుధవారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వ ప్రాథమ్యాలను వివరించారు.
రైతుల సాధికారత ప్రభుత్వ నైతిక కర్తవ్యమని, 260 టన్నుల ఉత్పత్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా రూ.20,616.89 కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసినట్టు చెప్పారు. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున రూ.1,206.44 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పిస్తూ వారికి రూ.5,005.95 కోట్లు ఆదా చేశామని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరై గవర్నర్ ప్రసంగాన్ని ఆలకించారు. మధ్యమధ్యలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండగా ఆయన చేయి పైకెత్తి వారిని వారించే ప్రయత్నం చేశారు. కాగా, గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సా ధించినట్టుగా గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ స భ్యులు మండిపడ్డారు. ప్రసంగంలో అన్నీ అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. షేమ్.. షేమ్ అంటూ నినాదాలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు: బీజేపీ
గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్ర భుత్వం పచ్చి అబద్ధాలు చెప్పిందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలను నెరవేర్చినట్టు గొప్పలు చెప్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీ ర్మానం చర్చ సందర్భంగా నిలదీస్తామని స్పష్టంచేశారు. బుధవారం అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఎంతమందికి కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా ఇచ్చారో లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ ఏక కాలంలో చేసినట్టు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఏ మహిళకు ప్రభుత్వం ద్వారా రూ.కోటి వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ; సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు భిన్నంగా, ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగించే విధంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు రూ.2,500, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, దళిత కుటుంబానికి రూ.12 లక్షలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఈ సంవత్సరం కూడా అమలు కాని పరిస్థితి కనబడుతున్నదని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో రెండు లక్షల ఉద్యోగా ల ప్రస్తావన లేదని దుయ్యబట్టారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తికాలేదని, విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై స్పష్టత లేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్‌సిటీ పేరుతో మాయాజాలాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.