అచ్చంపేట, మే 3 : ‘తాను ఆదివాసి మూలాల నుంచే వచ్చానని, నల్లమలలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తా’.. అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, జిల్లా అటవీ అభివృద్ధి అధికారి రోహిత్ గోపిడి ఆధ్వర్యంలో నల్లమలకు చెందిన 32 మంది నిరుద్యోగ యువత నేచర్గైడ్గా బెంగళూరులో శిక్షణ పూర్తిచేసుకున్నారు. హైదరాబాద్‌లో వారితో గవర్నర్ సమావేశమై శిక్షణ పొందిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. నేచర్గైడ్గా శిక్షణ పొందిన యువత నల్లమలలో పనిచేసే అవకాశం రావడాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోహిత్ మాట్లాడుతూ శిక్షణ పొందిన వారికి ఏటీఆర్‌లో నేచర్గైడ్గా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అప్పాపూర్, భౌరాపూర్ చెంచు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాజ్‌భవన్ నుంచి విస్తరాకు మిషన్లు అందజేశారు. చెంచు యువకుడు నిమ్మల నాగరాజు నేచురల్ లిస్టు ఫొటోగ్రాఫర్ ప్రతిభను గవర్నర్ అభినందించారు.