మహదేవపూర్, (కాళేశ్వరం) మే 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలు ఆదివారం నాటికి 11వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో వివిధ రాష్ర్టాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నది, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేకువజామునే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ఈనెల 15న ప్రారంభమైన పుషరాలు సోమవారంతో ముగియనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులతో త్రివేణి సంగమం, ఆలయ పరిసరాలు, రహదారులు, పారింగ్ ప్రదేశాలు కికిరిసిపోయాయి. కాళేశ్వరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శనం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.