TSRTC | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండురోజుల్లో ఆమోదించే అవకాశం ఉన్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. బిల్లుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరుతూ జేఏసీ నేతలు మంగళవారం గవర్నర్ను కలిశారు. బిల్లుపై తగిన సూచనలు తీసుకొని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపుతానని గవర్నర్ చెప్పినట్టు సమావేశం అనంతరం కార్మిక నేతలు వెల్లడించారు. కార్మికుల సమస్యలు, విలీన ప్రక్రియకు సంబంధించి గవర్నర్ పలు సూచనలు చేసినట్టు చెప్పారు. సుమారు నెలరోజుల నుంచి బిల్లు పెండింగ్లో ఉన్నదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. బిల్లు ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితమే బిల్లు వచ్చిందని, ఆ బిల్లులో పది సూచనలు చేసినట్టు గవర్నర్ తెలిపారని జేఏసీ నేతలు వెల్లడించారు.