హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాఠశాల విద్యావిధానంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు ఎన్ని పరీక్షలుంటాయి? ఎన్ని మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు? అనే అంశాలపై స్పష్టత కొరవడిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం, గ్రేడింగ్ విధానం ఉన్నట్లా… లేనట్టా అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. పాఠశాలవిద్యకు మార్గదర్శకంగా నిలిచే అకడమిక్ క్యాలెండర్‌ను ఎస్సీఈఆర్టీ విడుదల చేయలేదు. రానున్న విద్యాసంవత్సరంలో సర్కారు విధానమేంటో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్నది. ఈ నెల 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుందని, ఇంకెప్పుడు స్పష్టతనిస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
పూటకో విధానం.. ఇప్పుండేంటో!
నిరుడు 2024 -25 విద్యాసంవత్సరంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లు (ఎఫ్ఏ), రెండు సమ్మేటివ్ అసెస్మెంట్లు(ఎస్ఏ) నిర్వహించారు. జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఎఫ్ఏ, అక్టోబర్, ఏప్రిల్‌లో మాసాల్లో ఎస్ఏ పరీక్షలను పెట్టారు. తొలుత గ్రేడింగ్‌ను, ఇంటర్నల్స్ రద్దుచేశారు. ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో మొదట గ్రేడింగ్‌ను రద్దుచేసి, ఒక్క ఏడాది ఇంటర్నల్స్‌ను పునరుద్దరించారు. పదో తరగతి పరీక్షలు జరిగిన తర్వాత గ్రేడింగ్‌ను పునరుద్ధరించారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం రద్దుచేసినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ అధికారికంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదు. దీంతో మొత్తం పాఠశాల విద్యావిధానంపై అయోమయం నెలకొన్నది.