Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్టు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను గుడ్డిగా పాటిస్తూ.. ఏం చేస్తున్నామో? ఏం చేయకూడదో? కూడా అర్థంకాని స్థితికి కొందరు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. పదేండ్ల పాటు ఫోకల్లో ఉన్నా.. నాన్ ఫోకల్లో ఉన్నా.. ఎవరి పని వారు కామ్‌గా చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ పటిష్టానికి కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన విధులను కూడా సమర్థంగా నిర్వర్తించలేకపోతున్నామని కొందరు సీనియర్ అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో పోలీసు వ్యవస్థకు మెరుగులు దిద్దారని.. చేయాల్సినవి, చేయకూడనివి, తప్పనిసరిగా పాటించాల్సిన విధులపై ఆయన సీరియస్‌గా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులవుతుండగా.. తమపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వరస ఫెయిల్యూర్స్‌తో వ్యతిరేకత
కొందరు పోలీసు అధికారుల తీరు.. మొత్తం వ్యవస్థకే మకిలీ తెచ్చింది. గుడ్డిగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటిస్తూ వరుస తప్పిదాలు చేస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అక్రమ అరెస్టు దగ్గర్నుంచి గురువారం రాత్రి మాజీమంత్రుల అక్రమ అరెస్టు, గురువారం అర్ధరాత్రి అక్రమ నిర్బంధాల వరకూ ఏ క్లారిటీ లేకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఓ తప్పుడు కేసులో క్రిశాంక్‌ను బలవంతంగా ఇరికించేందుకు.. గత ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు ముప్పుతిప్పలు పెట్టారు. ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. 10 రోజుల్లో 6 సెషన్ కోర్టులకు క్రిశాంక్ కేసు బెయిల్ బదిలీ చేసినా.. క్రిశాంక్ ఫోర్జరీ చేసినట్టు ఆధారాలు చూపలేకపోయారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ తెలంగాణ సోషల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయన అరెస్టు చూపేందుకు అధికారులు కుస్తీపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇష్యూలోనూ బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేకపోయారు. మాజీమంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తదితరుల అరెస్టులపై సరైన క్లారిటీ లేక అభాసుపాలయ్యారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పుకోలేక పోలీసు ఉన్నతాధికారులు తిప్పలు పడి బీఆర్ఎస్ బృందాన్ని బతిమిలాడుకొని మరీ వదిలిపెట్టారు.
ప్రతిపక్షాలపై దాడులైతే అరెస్టుల్లేవ్!
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, వారి ఇండ్లు, ఆస్తులను ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు ధ్వసం చేస్తే వారిపై పేరుకే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడిన వారిని అరెస్టు చేసేందుకు మాత్రం సాహసించటం లేదు. అరెస్టు చేసినా సాయంత్రానికల్లా ఇంటికి పంపేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్తే.. అక్కసుతో కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారు. రాళ్లు, కర్రలతో నేతల కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. సంతోష్‌రెడ్డి అనే వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నా అనుమానాస్పద వ్యక్తులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని తెలిసింది. అందులో ఒకటి జీరో ఎఫ్ఐఆర్ అని విశ్వసనీయ సమాచారం. అంతకుముందు సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై నేటికీ ఎలాంటి చర్యలు లేవు.
నల్లగొండలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిశోర్‌పై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం సొంత గ్రామంలో రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడిచేసిన వారిపైనా చర్యలు లేవు. ప్రస్తుతం ఎమ్మెల్యే గాంధీ, అతని అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదుచేసినా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయటం, నిందితులకు పోలీసు స్టేషన్లో రాచమర్యాదలు చేయటం వెనుక అధికార పార్టీ పెద్దల ఒత్తిడి ఉన్నదని తెలుస్తున్నది. ఈ దాడుల్లో అధికార పార్టీకి చెందినవారు ఎవరున్నా సరే.. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, కుర్చీల్లో కూర్చోబెట్టి, అవసరమైతే చాయ్, స్నాక్స్ ఇచ్చి, రాత్రికి ఉండాల్సి వస్తే బిర్యానీ సైతం అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో ఉల్టా కేసులు కూడా పెడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి.
మీకు చేతకాదంటే చెప్పండి..
‘బీఆర్ఎస్ హయాంలో ఎక్కడో నాన్ఫోకల్లో ఉన్న మిమ్మల్ని మన ప్రజాప్రభుత్వంలో ఫోకల్లోకి తీసుకొస్తే.. మీరు చేసేది ఇలాగేనా? గాంధీ, కౌశిక్‌రెడ్డి ఇష్యూలో ఎందుకు ఇంత లొల్లి జరిగింది? అంత జరిగేంత వరకు మీరేం చేస్తున్నారు?’ అంటూ ఓ ప్రభుత్వ పెద్ద శుక్రవారం పొద్దుపొద్దునే పోలీసు బాస్‌లకు తలంటినట్టు తెలిసింది. తన జిల్లా బోర్డర్ వరకూ ఈ ఇష్యూ వెళ్లడం, తన జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ సానుభూతిపరులు కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు రావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏరికోరి తెచ్చుకుంటే ఎందుకబ్బా ఇజ్జత్ తీస్తారు. మీకు చేతగాదంటే చెప్పండి బీఆర్ఎస్ హయాంలో చేసిన వాళ్లతోనే పనిచేయించుకుంటా’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఇంత జరుగుతుంటే తీరిగ్గా వచ్చి ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తారా? ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో మీకు తెలుసా?’ అంటూ ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ బృందాన్ని సైబరాబాద్ సీపీ ఆఫీసు వరకు ఎందుకు రానిచ్చారని, వాళ్లందరినీ కేశంపేట, తలకొండపల్లివైపు ఎందుకు తీసుకెళ్లారని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలాగైతే కష్టం అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి పదేండ్ల పాలనలో సగర్వంగా తలెత్తుకొని బతికిన తెలంగాణ పోలీస్ వైభవం.. ప్రజాపాలనలో రాజకీయ క్రీడలో రోజురోజుకు దిగజారుతున్నది. అధికారంవైపే కొమ్ముకాయడం, నాయకులు చెప్పినట్టే వినడంతో అభాసుపాలవుతున్నట్టు పోలీస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.