హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలంతా చక్కని ఆరోగ్యం, సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆశయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకోసం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోందన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం మాట్లాడారు. ‘ప్రజావైద్యం, ఆరోగ్య రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది. తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. అధునాతన వైద్యపరికరాలు సమకూర్చింది.
57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసింది. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్‌ను ఆక్సీజన్ బెడ్స్‌గా మార్చింది. 56వేల ఆక్సీజన్ బెడ్లు నేడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో హార్ట్ సర్జరీల కోసం క్యాథ్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం అందించడానికీ, పారిశుధ్య ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు సైతం పెంచింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సహాయకులకు కూడా రూ.5కే భోజనం అందజేస్తున్నది.
గర్భిణుల హాస్పిటల్‌కు తీసుకురావడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలోనిలిచింది. మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి రూ.13వేల, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి రూ.12వేల ఈ పథకం ద్వారా అందజేయడం జరుగుతున్నది. అదనంగా మాతా, శిశు సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్టును కూడా ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటివరకు 13.30లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుంచి 56శాతానికి పెరిగింది. మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది శుభ పరిణామం.
ప్రభుత్వం హైదరాబాద్ బస్తీల్లో నివసించే పేదల వద్దకే వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నది.
నగరవాసులతో పాటూ ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా 2,679 కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళను నిర్మిస్తున్నది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయి. ఈ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వైద్య విద్యనందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పి.జి కోర్సులు, నర్సింగ్, పారమెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తారు. నిమ్స్ హాస్పిటల్లో మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్ లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి.
వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో రెండువేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుంది. వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చినవారు ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే, మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులలో ఇంటివద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇది ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని కేంద్రప్రభుత్వం అనేక సార్లు ప్రశంసించింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం, ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనం. తెలంగాణ ప్రాంతంలో గతంలో కేవలం మూడు మాత్రమే ఉన్న వైద్య కళాశాలలను ఇకపై జిల్లాకి ఒకటి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాగల రెండేళ్లలో ఈ లక్ష్యం నేరవేరనుంది.
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్యశాలలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు చేయిస్తే పరీక్షల రిపోర్టుల వివరాలు ఈ యాప్‌లో పొందుపరుస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ దవాఖానకు వెళ్లినా ఈ రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తారని’ సీఎం వివరించారు.