హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కౌలు రైతులకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, తమ ప్రభుత్వం వారిని పట్టించుకోదని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే రైతు, కౌలు రైతు మాట్లాడుకోవాలని సూచించారు. అనుకోని విధంగా కౌలు రైతుకు నష్టం జరిగితే సాయం చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ, తెలంగాణలో భూముల ధరలు పెరిగిందున తగాదాలు రావొద్దనే ఉద్దేశంతో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
కౌలు రైతులను మేం పట్టించుకోం…
కౌలు రైతుల విషయంలో ప్రభుత్వ పాలసీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినం. కౌలు అనేది ఆ రైతుకు.. ఆ కౌలుదారుకు సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. కౌలుదారు మారినప్పుడల్లా రాసుకుంటా పోవడం ప్రభుత్వ పని కాకూడదనే ఉద్దేశంతో ఆ కాలమ్ తీసేసినం. స్పష్టత ఉన్నది కాబట్టే కౌలు రైతులను పట్టించుకోబోమని ఇంత కచ్చితంగా చెప్తున్నం. మాకు మానవీయత లేదని కాదు.. అసలు రైతు నష్టపోవద్దనేదే మా పాలసీ. భూమి కొంత మంది పైరవీకారులు గద్దల్లా తన్నుకుని పోయే పరిస్థితి ఉండొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం.
నష్టం జరిగితే సాయం చేస్తాం..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కౌలు రైతులకు, గిరిజన రైతులకు నష్టం జరిగితే.. వారినీ ఆదుకునే ప్రయత్నం చేస్తం. మరెక్కడా లేని విధంగా రైతాంగానికి మంచి పనులు చేస్తున్నం కాబట్టి.. వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, మంచి ఫలితాలు వస్తున్నాయి. మీమీ ప్రాంతాల్లో కౌలు, గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతే వంద కోట్లో, రెండు వందల కోట్లో ఇచ్చి ఆదుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఏ ప్రాంతంలో నష్టం జరిగినా మంత్రుల దృష్టికి తీసుకురండి. అవసరమైతే సీనియర్ ఆఫీసర్ల బృందాన్ని పంపించి న్యాయం చేస్తాం. గతంలో ఆర్వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు లేకుండే. ట్రైబల్ ఎమ్మెల్యేలు నాతో చెప్తే.. పట్టా పుస్తకాలు తీసుకురమ్మని చెప్పి.. పని చేసిన. ఇప్పుడు మూడు లక్షల మంది రైతులకు రైతుబంధు, రైతుబీమా వస్తున్నది.
అందుకే.. ధరణి పోర్టల్ తీసుకొచ్చినం
తెలంగాణలో భూముల విలువ లక్షలకు లక్షలు పెరిగిపోతున్నది హత్యల్లాంటి పెద్ద గందరగోళం జరిగే ప్రమాదం ఉంటదని ధరణి పోర్టల్ తీసుకొచ్చిన. దీంతో చాలా రిలీఫ్ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర ఓ రైతు తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి, ఆయనపై కూడా పోసుకొని నిప్పంటించుకొని చనిపోయారు. ఇలా విపరీతమైన పరిణామాలకు దారి తీస్తది కాబట్టి ధరణి పోర్టల్ తీసుకొచ్చినం. పోడు విషయంలో మొన్నే అసెంబ్లీలో హామీ ఇచ్చిన. మూడో వారం నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ తీసుకుంటరు. నెలలో ప్రాసెస్ పూర్తిచేసి, వారికీ పట్టాలు ఇచ్చుకుందం. వాళ్లనూ రోల్స్ మీదకు తెచ్చుకుందాం.