Sunkishala | ఇటీవల నిర్మాణంలో సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై సర్కారు బదిలీ వేటు వేసుంది. ఇక ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్-3 అధికారులైన సీజీఎం కిరణ్, జీఎం మరియరాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌పై సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి దాన కిశోర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. నిర్మాణ సంస్థకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ వద్ద పంప్‌హౌస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్‌కు ఇటీవల భారీగా వరద వచ్చింది. దాంతో ఒక్కసారిగా పంప్‌హౌస్ రెండో టన్నెల్ నుంచి భారీగా నీరు రావడంతో ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతోపాటు రిటైనింగ్ వాల్లోని ప్యానెల్ కొట్టుకుపోయింది. అలాగే, పంప్‌హౌస్ అంతా నీటితో నిండింది. ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది.