సంగారెడ్డి, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు (Singur Project) మరమ్మతులపై ప్రభుత్వం వచ్చేనెలలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు రావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదలశాఖ లేఖ రాసింది. సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ప్రాజెక్టును ఖాళీ చేస్తే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంపైనా జలమండలి, మిషన్ భగీరథ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని నీటిపారుదలశాఖ కోరింది. దీంతో ప్రభుత్వం వచ్చేనెల 5 లేదా 7న ఇరిగేషన్, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయడం, మరమ్మతులు చేపట్టడంపై నిర్ణయం తీసుకోనున్నది. వచ్చేనెలలో రోజూ సుమారు 30 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతూ వారంలోగా 16 టీఎంసీలు ఖాళీ చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరమ్మతులకు రెండేండ్లు
సింగూరు ఆనకట్ట మరమ్మతు పనులు, కొత్త రివిట్మెంట్ పనులు పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రెండేండ్ల పాటు ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచనున్నారు. ఈ సమయంలో సింగూరు వద్ద విద్యుత్తు ఉత్తత్తి నిలిచిపోనున్నది. కాగా ప్రాజెక్టు మరమ్మతులను రూ.16 కోట్లతో చేపట్టేందుకు నీటిపారుదలశాఖ టెండర్లు వేయగా దక్కించుకునేందుకు రెండు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇవి శనివారం ఫైనల్ కానున్నాయి.
7 కిలోమీటర్ల ఆనకట్టకు మరమ్మతులు
సింగూరు కుడి, ఎడమ వైపు ఏడు కిలోమీటర్లు ఉన్న ఆనకట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు 2001-02లో ఆనకట్టకు మరమ్మతులు చేశారు. పనుల్లో నాణ్యతాలోపం కారణంగా ఆనకట్ట రివిట్మెంట్లో పగుళ్లు వచ్చి కుంగిపోవడం ప్రారంభమైంది. నిరుడు రివిట్మెంట్ పగుళ్లు ఉన్నచోట్ల ఇసుక బస్తాలు వేశారు. అయినా రివిట్మెంట్ పగుళ్లు తగ్గకపోవడాన్ని గుర్తించిన ఎన్డీఎస్ఏ వెంటనే ఇరువైపులా ఏడు కిలోమీటర్లు ఉన్న ఆనకట్టలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. పనులు డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఆనకట్టలు కోతకు గురికాకుండా ఉండేందుకు వేవ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయనున్నారు.
తాగు, సాగునీటికి తప్పని ఇక్కట్లు!
సింగూరు మరమ్మతులు ప్రారంభమైతే రెండేళ్లపాటు ప్రాజెక్టు కింద ఉన్న 40 వేల ఎకరాలకు సాగునీరు పూర్తిగా నిలిచిపోనుంది. ఇది వరకే ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ జంటనగరాలతోపాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు రెండేళ్లపాటు మంజీరా జలాల కేటాయింపు నిలిచిపోనున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని జలమండలి, మిషన్‌భగీరథ అధికారులకు నీటిపారుదలశాఖ సూచించింది.