Kancha Mamidipally | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ‘కంచ గచ్చిబౌలి’ కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల కథ తెరమీదికి వచ్చింది. కంచ గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణంతో ముడిపడి ఉన్నా యి. కానీ ఇక్కడి భూములు బీసీ రైతులు, ఆ కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం, అంతకుమించి రెండు దశాబ్దాల న్యాయ పోరాటంతో ముడిపడి ఉన్నాయి. అవే.. ‘కంచ మామిడిపల్లి’ భూములు! దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్గువకే బిల్లీరావుకు కేటాయించిన భూములు కూడా ఉన్నా యి. హైకోర్టు గత ఏడాది ఈ భూములపై స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసింది. ఈ నేపథ్యంలో రేపోమాపో ఈ భూములనూ సర్కారు అమ్మేందుకు సిద్ధమవుతున్న దరిమిలా రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న తమకు న్యాయం చేయాలని దాదాపు 186 బీసీ రైతు కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం మొదలైన భూసేకరణ ప్రక్రియతో ఈ భూములు తమవి కాకుండా పోయాయని, అప్పటివరకు దశాబ్దాలుగా తమకు ఆధారమైన భూములకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పారు.గత ఏడాది ఐఎంజీ భారత కేసు వీగిపోయినందున ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా ‘కంచ మామిడిపల్లి’ రైతుల కన్నీటివ్యథ ఎందుకు కంచికి చేరడంలేదనే దానిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లిలోని సర్వే నంబరు 99/1లో 2,131.38 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములు సర్ఫ్-ఏ-ఖాస్ అథారిటీకి చెందినవి. అంటే నిజాంకు ఆదాయాన్ని తెచ్చే ప్రైవేటు ఆస్తులు. అందుకే రెవెన్యూ రికార్డుల్లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరిట నమోదై ఉన్నాయి. 1956లో అటవీ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా (నోటిఫికేషన్ నంబర్-1348, 1105/ఏ3/55-56, తేదీ: 28.2.1956) ఈ భూములతోపాటు మరికొంత కంచ భూములను సేకరించింది. పశువులకు మేతకుగాను ఈ భూములను కేటాయించాలని అప్పట్లో నిర్ణయించిన దరిమిలా వీటికి కంచ భూములుగా పేరు వచ్చింది. 1965లో పశు సంరక్షణలో భాగంగా అప్పటి ప్రభుత్వం జీవో-1489 ద్వారా ఈ భూములను పశు సంవర్ధక శాఖకు బదలాయించింది. మామిడిపల్లితోపాటు పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకల ద్వారా జీవనోపాధి పొందే యాదవులు, బోయ సామాజిక వర్గం వారే అత్యధికంగా ఉన్నారు. దీంతో 1966లో పశు సంవర్ధక శాఖ 600 ఎకరాల విస్తీర్ణంలో గొర్రెల మేత కోసం చర్యలు చేపట్టింది. మిగిలిన భూమిని గ్రామ ప్రజలు వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకొని సాగు చేయడం మొదలుపెట్టారు. రెవెన్యూ పహాణీల్లో కూడా కబ్జాదారుల కాలంలో చాలామంది రైతుల పేర్లు వచ్చాయి. ఇలా 2001 వరకు రైతులు ఆ భూముల్లో సాగు చేసుకోవడం, గుట్టలు ఉన్నచోట సీతాఫలాలు ఏరి వాటిని విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతూ వచ్చారు.
2001 తర్వాత చెట్టుకొకరు.. పుట్టకొకరు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 2000 సంవత్సరంలో భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా 2001లో మామిడిపల్లిలోని సర్వే నంబరు 99/1లో ఉన్న భూమిని కూడా సేకరించారు. ఇందులో 1,051.34 ఎకరాలను కేటాయించారు. కానీ, ఇందులో 970.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 583 మంది రైతులకు ఎకరాకు రూ.65 వేల చొప్పున రూ.6.32 కోట్ల పరిహారం చెల్లించారు. ఆ తర్వాత అప్పటి ఏపీఐఐసీ మరో 981.32 ఎకరాలను సేకరించి, కేవలం 205.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 136 మందికి మాత్రమే రూ.1.02 కోట్ల నష్ట పరిహారాన్ని పంపిణీ చేసింది. ఇలా 2,032.24 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు, ఏపీఐఐసీ సేకరించినప్పటికీ, కబ్జాలో ఉన్న రైతులందరికీ నష్ట పరిహారాన్ని సక్రమంగా అందించలేదు. దీంతో చాలామంది రైతులు అటు భూమిని కోల్పోయి, ఇటు నష్టపరిహారం అందక చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు.
అప్పటి నుంచి ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ఎంతమంది రైతులు ఉన్నారు? గతంలో ఎంతమందికి నష్టపరిహారం అందింది? ఇంకా ఎంతమందికి అందాలనే దానిపై పలు నివేదికలు ఇచ్చారు. ముఖ్యంగా అప్పటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విమానాశ్రయానికి పోను మిగిలిన భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రైవేటు కంపెనీలకు పప్పు బెల్లంలా పంచడంతో భూములు వారి ఆధీనంలోకి పోయాయి. దీంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు గతంలో కబ్జాలో ఉన్న రైతుల వివరాలను కచ్చితంగా సేకరించడం కష్టసాధ్యంగా మారింది.
రైతులకు పరిహారమివ్వండి
మామిడిపల్లి రైతులు.. ప్రజాప్రతినిధుల, అధికారుల చుట్టూ తిరగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం 2013లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కమిటీ 2013 మార్చి 25న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో 99/1 సర్వే నంబరులోని భూముల వివరాలు, వాటి నేపథ్యాన్ని పొందుపరిచింది. ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో 488 ఎకరాలను ఇందూటెక్, బ్రాహ్మణి ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు ఇవ్వడంతో గతంలో అక్కడ కబ్జాలో ఉన్న రైతుల వివరాలను గుర్తించడం సాధ్యం కావడం లేదని పేర్కొన్నది. అదేవిధంగా మిగిలిన కొంతభూమిలో గుట్టలు, ఏనెలు ఉన్నందున కబ్జాదారుల గుర్తింపు కష్టతరంగా మారిందని తెలిపింది. అందుకే రెవెన్యూ అధికారులు గత రికార్డులను పరిశీలించి కబ్జాలో ఉన్న రైతుల జాబితాను రూపొందించి, వారికి నష్టపరిహారం ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు తర్జనభర్జనల తర్వాత 444.10 ఎకరాల విస్తీర్ణంలో 189 మంది రైతులు కబ్జాలో ఉండేవారని తేల్చారు. కానీ, ఇప్పటివరకు వారికి తగిన న్యాయం జరగలేదు. అయితే విమానాశ్రయం, ఏపీఐఐసీ ఈ భూములను సేకరించిన సమయంలో భూమిని కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఇంటిలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. అంతేగాకుండా గుట్టలు, ఏనెలు ఉన్న ప్రాంతాన్ని తాము సేకరించబోమని, దానిని రైతులే మూగజీవాలను మేపేందుకు వినియోగించుకోవచ్చని కూడా భరోసా కల్పించారని, కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద గుట్టలను కూడా తొలిచి కంపెనీలకు ఇచ్చారని వాపోతున్నారు.
పేరుకే అభివృద్ధి.. లక్ష్యం తమ వారికి లబ్ధి
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపామనే సమైక్య పాలకుల గొప్పలు మేడిపండు చందమే! గతంలో సమైక్య పాలకులు చేపట్టిన ప్రతి అభివృద్ధి పని వెనుక తమ వారి లబ్ధి దాగి ఉన్నదనేందుకు మామిడిపల్లి భూములే ప్రత్యక్ష నిదర్శనం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చంద్రబాబు హయాంలో ప్రతిపాదనలు తయారయ్యాయి. పైకి ఇది హైదరాబాద్ అభివృద్ధి జపం. కానీ, సరిగ్గా విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మామిడిపల్లి సర్వే నంబరు 99/1తోపాటు మహేశ్వరం మండలం రావిర్యాల సర్వే నంబరు 1/1లోని 86.32 ఎకరాలను కలుపుకొని మొత్తం 450 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత పేరిట బిల్లీరావుకు కట్టబెట్టింది. ప్రభుత్వం సేకరించిన భూములకుగాను రైతులకు ఎకరా రూ.65 వేలు చెల్లిస్తే… చంద్రబాబు మాత్రం బిల్లీరావుకు ఎకరా కేవలం రూ.25 వేలకే అంటే మొత్తం 450 ఎకరాలను రూ.1.12 కోట్లకే ధారాదత్తం చేశారు. అయితే, 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. అనంతరం మామిడిపల్లిలోని 99/1 సర్వే నంబరులో ఏకంగా 448 ఎకరాలను ఇందూటెక్, బ్రాహ్మణి ఇన్ఫోటెక్‌కు కట్టబెట్టింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల అభివృద్ధి కోసమంటూ ఈ కేటాయింపులు చేశారేగానీ ఇప్పటిదాకా ఆ మేరకు భూముల వినియోగం జరగలేదు. పైగా ఇందులో 250 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకున్నట్టు తెలిసింది.
న్యాయంగా పరిహారమివ్వండి
విమానాశ్రయం, ఏపీఐఐసీ సేకరించిన భూములకుగాను పరిహారం చాలామందికి ఇచ్చారు. కానీ, అందులో కొంతమంది తమకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరికితోడు అసలు పరిహారమే అందని 186 మంది రైతులు కూడా కోర్టుకు వెళ్లారు. పక్కనే ఉన్న నాదర్గుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్‌వేర్ పార్కు కోసం ఏపీఐఐసీ భూములు సేకరించినప్పుడు ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పరిహారం ఇచ్చిందని, అదేరీతిన తమకు న్యాయం చేయాలని మామిడిపల్లి రైతులు డిమాండు చేస్తున్నారు. అయితే, ఐఎంజీ భారతకు చెందిన 450 ఎకరాల కేసు ఇటీవల వరకు కోర్టులోనే పెండింగులో ఉన్నది. గత ఏడాది మార్చిలో కంచ గచ్చిబౌలితోపాటు మామిడిపల్లి భూములు కూడా ప్రభుత్వానివేనంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అందులో పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలో ఉంటే వారిని అక్కడి నుంచి పంపి స్వాధీనం చేసుకున్నది. టీజీఐఐసీ బోర్డు లు ఏర్పాటు చేసింది. కాగా, కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నెలకొనడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో తా జాగా ప్రభుత్వం కంచ మామిడిపల్లి భూ ములపై దృష్టిసారించింది. దీంతో ప్రభు త్వం రేపోమాపో వేలం వేసి ఈ భూములను విక్రయించేందుకు సిద్ధమవుతున్నదని తెలుసుకున్న మామిడిపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సరోజినీ పుల్లారెడ్డి సైతం కొట్లాడారు
మామిడిపల్లి రైతులకు న్యాయం చేయాలని గతంలో సరోజినీ పుల్లారెడ్డి సైతం కొట్లాడారు. 20 ఎకరాల్లో కబ్జాలో ఉన్నాం. పన్ను కట్టిన రశీదులు ఉన్నాయి. పరిహారం ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. భూమికి భూమి ఇస్తామని చెప్పారు. జీవాలను మేపుకోవడానికి పొలం చూపిస్తామన్నారు. చూపించిన గుట్టలను సైతం మలుపుకొన్నారు. రైతులను ఎక్కడికీ రానివ్వడం లేదు. మాకు ఉపాధి లేకుండా పోయింది.
-యాతం బాలయ్య, మామిడిపల్లి రైతు
పేదల భూములు పెద్దలకు పంచుతున్నరు
మామిడిపల్లిలో ఉన్న పేదల భూ ములను తీసుకొని పెద్దలకు కట్టబెడుతున్నారు. జీవాలను మేపుకోవడానికి పొలం లేకుండాపోయింది. నాకు సర్వే నంబర్ 99/1లో ఇరవై ఎకరాల భూమి ఉన్న ది. అంతా ప్రభుత్వమే తీసుకొని కంపెనీలకు ఇచ్చింది. రైతులు ఏ పని చేసుకొని బతకాలి? ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రెవెన్యూ అధికారులు చేసిన సర్వే ప్రకారం రైతులకు కనీసం ఐదు ఎకరాలు ఇవ్వాలి.
కోర్టులో వివాదం ఉండగానే నిర్మాణాలు జరుగుతున్నాయి.
– మహేందర్‌యాదవ్, మామిడిపల్లి
హామీ నెరవేర్చలేదు
మామిడిపల్లి సర్వే నంబర్ 99/1 లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నెరవేర్చ లేదు. రైతులను మోసం చేసుడు తప్ప న్యాయం చేసే వారు లేరు. రైతులకు న్యాయం చేయాలని కనబడ్డ వాళ్ల కాళ్ల మీద పడ్డాం. ఎవరూ సహాయం చేయలేదు.
– ఆర్ శ్రీను, మామిడిపల్లి రైతు
మా భూములు మాకే కావాలి
మామిడిపల్లిలో ఉన్న సర్వే నంబర్ 99/1 లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి. తాతముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకొని జీవించినం. 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు. ఏ రైతుకు ఎంత భూమి ఉన్నదో రెవెన్యూ అధికారులు గుర్తించిండ్రు. ఎయిర్పోర్ట్ కోసమని భూమి తీసుకుని ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? కేసు చిక్కుముడి వీడింది కాబట్టి..పైసా పరిహారం ఇవ్వనందుకు ఆ భూములను రైతులకే తిరిగివ్వాలి!
– దశరథ,మామిడిపల్లి రైతు
2014 రెవెన్యూ రికార్డుల ప్రకారం 99/1,2,3 సర్వే నంబరులోని 2,131 ఎకరాల పంపిణీ ఇలా..