అధికారులు వివరాలు సేకరించాలి: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు, సంరక్షకులు లేని అనాథలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించబోతున్నదని, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కొవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఆమె హైదరాబాద్లోని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో అన్ని జిల్లాల మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆశ్రమాల్లో ఎంతమంది అనాథలున్నారు? వారి వయసెంత? ప్రస్తుతం వారికి అందుతున్న సౌకర్యాలేమిటి? , ఆడపిల్లలు అనాథలుగా ఉంటే 18 ఏండ్ల తర్వాత వారి పరిస్థితి ఏమిటి? తదితర సమాచారాన్నంతా సంపూర్ణంగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో అంగన్వాడీలు అద్భుత సేవలందించారని, వారి కృషితో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 24 నుంచి 50 శాతానికి పెరిగాయని ప్రశంసించారు. అనాథల వివరాల సేకరణలో అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. దేశంలో అనాథలను ఆదుకొనేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని యునిసెఫ్ ప్రతినిధి మురళీ కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.