Telangana | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జాయి ంట్ వెంచర్ల(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం)లో వివాదాల పరిష్కారానికి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసి సమస్యలు పరిషరించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రటరీలతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో భట్టి అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలుష్యం సమస్య ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తాము ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు వెళ్తామని సబ్ కమిటీకి తెలిపారు. వారి విజ్ఞప్తులు పరిశీలించి ఓఆర్ఆర్ బయట పరిశ్రమలు స్థాపించేలా సహకరించాలని, పరిశ్రమలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్ ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది.
ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్..
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు మినిట్స్ రూపంలో నమోదుచేయాలని, వారంలో జరిగే సమావేశానికి అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, క్రాంతి పాల్గొన్నారు.