Congress Govt | జయశంకర్ భూపాలపల్లి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): గోదావరి, మానేరు నదుల్లో పేరుకుపోయిన ఇసుకను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక రూపొందించింది. 2.59 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌కు స్కెచ్ వేసింది. అందులో భాగంగా 11.50 కిలోమీటర్ల గోదావరి, మానేరు నది పొడవునా లైడార్ సర్వేను ప్రారంభించింది. ఇప్పటికే పలుగుల 5, పలుగుల 6, కుంట్లం, విలాసాగర్, అన్నారం, అంబట్పల్లి 1, 2, 3 క్వారీల ద్వారా నిత్యం 1,200 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నది. లీగల్‌గా, ఇల్లీగల్‌గా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు అధికారి పరిధిలో ఒక్క రోజులోనే 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. అయినా మళ్లీ కొత్త రీచ్‌ల కోసం ప్రభుత్వం సర్వే ప్రారంభించించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లోనే ఇసుక నిల్వలపై హైడ్రోగ్రఫీ సర్వే జరిపినప్పటికీ, భూగర్భ జలాలు అడుగంటుతాయనే కారణంగా వెనుకడుగు వేసింది. కాగా, జయశంకర్ భూపాలపల్లితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాళేశ్వరం బరాజ్‌కు మరమ్మతులు చేసి, నీరందించాల్సిందిపోయి ఇసుక దోపిడీకి తెరలేపడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.