హిమాయత్‌నగర్, జూన్ 24 : రాష్ట్రవ్యాప్తంగా చేనేత, పవర్లూమ్ కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టీ వెంకట్రాములు డిమాండ్ చేశారు. కార్మికులకు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తూ, చేనేత వస్ర్తాలను కొనుగోలు చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక దానిని విస్మరించిందని మండిపడ్డారు.
ప్రభుత్వం బకాయి ఉన్న బతుకమ్మ చీరల బిల్లులను చెల్లించి, చేనేత మిత్ర, చేనేతకు చేయూత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకొన్న చేనేత కార్మిక కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.