హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందుకు వచ్చి తన క్యాబినెట్ మంత్రులు సహా అంబేదర్ సృ్మతివనాన్ని సందర్శించాలని, ఆ మహనీయుడికి నివాళులర్పించాలని కోరారు. ఈ 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయించి, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని వెల్లడించా రు. కేసీఆర్పై కోపం ఉంటే విశ్వమేధావి అయిన అంబేదర్ను అవమానించడం ఎందుకని ఆమె ప్రశ్నించారు.
ప్రపంచ దేశాలు డాక్టర్ అంబేదర్ను గౌరవిస్తున్నాయని పేర్కొంటూ.. సెక్రటేరియట్ పకనే నిర్మించిన ఆయన విగ్రహాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం గౌరవించకపోవడం బాధాకరమని వాపోయారు. అంబేదర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ కేంద్రంగా పాలన సాగిస్తూ.. కేసీఆర్పై అకసుతో అంబేదర్ను గౌరవించకపోవడం అవమానకరమని మండిపడ్డారు. గతేడాది అంబేదర్ జయంతికి సీఎంతోపాటు ఏ ఒక మంత్రి కూడా.. ఈ 125 అడుగుల అంబేదర్ విగ్రహానికి నివాళులర్పించలేదని దుయ్యబట్టారు. కనీసం ఆ మహనీయుడి విగ్రహానికి ఒక పూలమాల కూడా వేయకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. ఈ సారి అలాంటి తప్పిదం జరగకుండా సీఎం చొరవ చూపాలని కోరారు. అంబేదర్ విగ్రహం, సృ్మతివనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత సర్కారును డిమాండ్ చేశారు.
షకీల్ కుటుంబానికి పరామర్శ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆదివారం వారి కుటుంబసభ్యులను హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు పరామర్శించారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.