హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీలోఫర్ దవాఖానలో అక్రమాలు జరుగుతున్నట్టు పలు ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దవాఖాన అధికారులు, సిబ్బంది పనితీరుపై విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యంగా బ్లడ్‌బ్యాంక్‌లో జరుగుతున్న అక్రమాలు, సిబ్బంది దోపిడీపై ప్రత్యేక విచారణ చేపట్టాలని, అందుకోసం సీనియర్ ప్రొఫెసర్లతో ఓ కమిటీ వేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ‘నీలోఫర్’ పనితీరుపై చాలా కాలం నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు కుంటి సాకులతో కీలక శస్త్రచికిత్సలను సైతం వాయిదా వేస్తున్నారని, రోగుల సందర్శనకు వెళ్లేవారిని కాసుల కక్కుర్తితో సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని, బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు.