Munneru river | ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరం 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం 690 కోట్లు మంజూరు చేసిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలేపల్లి చప్టా నుంచి ప్రకాశ్‌నగర్ వరకు ఈ గోడలు నిర్మిస్తామని చెప్పారు. క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ముందు మున్నేరు వరదల గురించి ప్రస్తావించానని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారుల అధ్యయనం అనంతరం అతి తక్కువ భూమిని సేకరించి గోడలు నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. గోడల నిర్మాణంలో ఒక్క ఇల్లు కూడా కూల్చే అవసరం లేదని చెప్పారు. ఖమ్మం నగరం నుంచి వచ్చే మురుగును ధంసలాపురం ఎస్టీపీకి తరలించేందుకు వాల్ పక్క నుంచి పైప్‌లైన్స్ నిర్మిస్తామని తెలిపారు. మున్నేరుపై పద్మావతినగర్, రంగనాయకుల గుట్ట, పోలేపల్లి వద్ద మూడు చెక్‌డ్యాంలు నిర్మిస్తామని, దీనికి ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిర్మాణాలు పూర్తయితే సుమారు 1.5 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని అన్నారు. కొన్ని కిలోమీటర్ల మేరకు భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని చెప్పారు.
ఆర్సీసీ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీశాఖ రూ.180 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇలా మున్నేరుపై చెక్‌డ్యాంలు, తీగల వంతెన, ఆర్సీసీ వాల్స్ నిర్మాణానికి సర్కార్ మొత్తం రూ.900 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాల్ పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.3 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అంటూ.. నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజులు పాల్గొన్నారు.