హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపర్ (పేపర్-1 లేదా పేపర్-2) రాయాలనుకున్న వారికి రూ.1000గా ఉన్న దరఖాస్తు రుసుమును రూ.750కు తగ్గించింది. రెండు పేపర్లకు రూ.2వేలుగా ఉన్న ఫీజును రూ.1000 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన టెట్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించని వారికి ఫీజునుంచి మినహాయింపునిచ్చింది.
కాగా, గత రాత్రి 11 గంటల నుంచి టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాయి. ఈ నెల 5న ప్రారంభం కావాల్సిన దరఖాస్తులు సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. పరీక్ష ఫీజుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో మరింత సమాచారం ఉంది. ఏవైనా సందేహాలుంటే అందులో చెక్ చేసుకోవచ్చు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ఇంతకు ముందే తెలిపిన విషయం విధితమే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ పరీక్షను నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఎగ్జామ్ రాయనున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్షలు పెట్టగా జనవరిలో 10వ సారి జరగనుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గతేడాది మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు నిర్వహించారు.