హైదరాబాద్, ఆగష్టు16 (నమస్తే తెలంగాణ) : చారిత్రక కట్టడాలు, పురాతన వారసత్వ సంపద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తుశాఖ ద్వారా రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అరుదైన కళాఖండాలు, చారిత్రక సంపదను గుర్తించి వాటిని పరిరక్షిస్తున్నది. ఈ సంపదను సంరక్షించడమే కాకుండా వాటిని దేశ విదేశాల్లో ప్రదర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది.
అంతర్జాతీయస్థాయిలో కళాఖండాల ప్రదర్శన
రాష్ట్రంలోని ఫణిగిరి, ధూళికట్ట, నేలకొండపల్లి ప్రాంతాల్లో లభించిన రెండో శతాబ్దానికి చెందిన అరుదైన బౌద్ధ ఆరామాలకు చెందిన శిల్పకళా సంపదను న్యూయార్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో జూలై 17 నుంచి ప్రదర్శిస్తున్నది. నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ శిల్పకళా సంపదనే కొరియాలోని నేషనల్ మ్యూజియంలో 14 ఏప్రిల్ 2024 వరకు ప్రదర్శించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని గాంధీ సెంచరీ మ్యూజియం పునర్వ్యవస్థీకరణకు రూ.9.80 కోట్లతో రూపొందించిన అంచనాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనంలోని బుద్ధిస్ట్ మ్యూజియంలో చారిత్రక అంశాల వివరణ, కళాఖండాల ప్రదర్శనకు అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్‌లో మరో మ్యూజియం ఆధునీకరణకు రూ.3 కోట్ల ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించింది.
వారసత్వ సంపద సంరక్షణ
మహబూబ్‌నగర్ జిల్లాలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో 229 రాగి నాణేలు లభించాయి. అవి 1626 నుంచి 1672 మధ్యకాలానికి చెందిన కూలీకుతుబ్ షా, 1672 నుంచి 1686 మధ్యకాలానికి చెందిన అబ్దుల్ హసన్ షాకు చెందినవిగా గుర్తించారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 5 పెద్ద రాగి నాణేలు, కుతుబ్‌షాకి చెందిన 95 చిన్న రాగి నాణే లు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆధునిక కాలంనాటి రాగి నాణెం, జయశంకర్ భూపాలపల్లిలో మొఘలుల నాటి 41 వెండి నాణేలు, 2 రాగి నాణేలు, 4 ఇత్తడి ఉంగరాలు, ఒక ఇత్తడి రేకు, ఇతరఅరుదైన చారిత్రక సంపదను పురావస్తుశాఖ గుర్తించి భద్రపరిచింది.
తవ్వకాలకు ఒప్పందాలు
రా్రష్ట్రంలోని చారిత్రక ఆనవాళ్లను, సంపదను వెలికితీసేందుకు, పరిరక్షించేందుకు వివిధ సంస్థలతో పురావస్తుశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. గోలొండలోని కులీకుతుబ్‌షా టూం బ్స్, సంతోష్‌నగర్‌లోని పైగా టూంబ్స్‌లో పరిశోధనలకు ఆగాఖాన్ ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ సమీపంలోని సైధాని మాబావి, టూంబ్స్ పరిరక్షణ, చార్మినార్ బాద్-షాహి అసూర్‌ఖానా, షేక్‌పేట్‌లోని షేక్‌పేట్ సరాయి అభివృద్ధి కోసం ఆగాఖాన్ ఫౌండేషన్, మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలతో ఒప్పందం చేసుకుంది.