నీటి ప్రాజెక్టుల్లో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తున్నది. రూ.వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఓ గుజరాత్ కంపెనీకి రాష్ట్రంలో పూడికతీత కాంట్రాక్టును అప్పగించేందుకు చర్యలు తీసుకుంటు న్నారని, ఈ మేరకు ఓ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఎలాంటి విధివిధానాలు ఖరారు కాకుండానే పూడికతీత కోసం 3 ప్రాజెక్టులను ఎంపిక చేయడంతోపాటు, ఏకంగా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పూడికతీతకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కడెం, లోయర్‌మానేరు, మిడ్‌మానేరు డ్యామ్‌లను ఎంపిక చేసింది. వీటిలో పేరుకుపోయిన పూడికను డ్రెడ్జింగ్ (నీళ్లు ఉండగానే పూడిక తీసి సారపు మట్టి, ఇసుక, సిల్ట్ వేరు చేయడం) విధానంలో తొలగించనున్నారు. కడెం ప్రాజెక్టులో 3.28 కోట్ల టన్నులు, రాజరాజేశ్వర జలాశయంలో 62 లక్షల టన్నులు, లోయర్ మానేరు డ్యామ్‌లో 33 లక్షల టన్నులు మొత్తంగా 4.23 కోట్ల టన్నుల పూడిక తీయాలని నిర్ణయించారు.
వేరుచేసే ఇసుకకు సంబంధించి క్యూబిక్ మీటర్‌కు రూ.336.39 ధరగా నిర్ణయించారు. దీనిద్వారా రూ.1439.55 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. పనుల అప్పగింతకు కరీంనగర్ ఎస్ఈ నోటిఫికేషన్ సైతం జారీ చేయగా 4వ తేదీ నుంచే టెండర్ల స్వీకరణ ప్రారంభమైంది. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తంగా 20 ఏండ్ల కాలపరిమితితో ఆయా డ్యాముల్లో పూడికతీత పనులను కాంట్రాక్ట్ సంస్థకు కట్టబెట్టనుండగా గుజరాత్‌కు చెందిన కంపెనీ కోసం ఓ ముఖ్యనేత ముందే దస్తీ వేసినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది.
కాగా నిజంగా పూడిక నిండిన ప్రాజెక్టులను వదిలేసి ఎక్కువగా ఇసుక, నీళ్లు ఉన్న ప్రాజెక్టులను ఎంపికచేయడంపై ఇరిగేషన్శాఖలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకు పూడిక తీత అని కనిపిస్తున్నా.. ఇందులో సదరు గుజరాత్ కంపెనీతో కలిసి ఇష్టారాజ్యంగా ఇసుకను గొల్లగొట్టి జేజులు నింపుకొనే బాగోతం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇదంతా ఇసుక దోపిడీ కోసం తప్ప మరేమీ కాదని సాగునీటి రంగ నిపుణులు సైతం ఘంటాపథంగా చెప్తున్నారు.
జలాశయాలు, ప్రాజెక్టుల్లోని పూడికతీతకు సంబంధించి కేంద్రం 2022లో మార్గదర్శకాలు జారీ చేసింది. దానిపై అధ్యయనం చేసి రాష్ట్రంలో పూడికతీత చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు చేయాలని ప్రభుత్వం సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ క్యాబినెట్ సబ్‌కమిటీ ఇటీవల ప్రత్యేకంగా సాగునీటిపారుదలశాఖ, మైన్స్ అండ్ జియాలజీ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
పూడికతీతకు ప్రణాళికలు రూపొందించాలని, సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఇరిగేషన్‌శాఖ తాజాగా మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు మాత్రమే పూడికతీతకు సంబంధించి పాలసీలు అమలు చేస్తున్నాయని తెలిపింది. ఆయా రాష్ర్టాల పాలసీల్లోని అంశాలను నివేదికలో పొందుపరిచింది.
ఇప్పటికే రాజస్థాన్‌ను సందర్శించామని, అదేవిధంగా మిగిలిన రాష్ర్టాల్లోనూ క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేయాలని, తద్వారా సమగ్రమైన విధానాలను రూపొందించుకునే అవకాశముంటుందని తెలిపింది. కాగా ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇక అసలు ప్రాజెక్టుల్లో ఏ మేరకు పూడికలు ఉన్నాయి? అందులో ఏమున్నాయి? సారవంతమైన మట్టి ఎంత? చెత్తాచెదారం ఎంత? ఇసుక ఎంత మేరకు ఉంటుంది? ఏ మేరకు తవ్వకాలు చేపడుతారు? తదితర అంశాలపై స్పష్టత రాలేదు. పూడికతీతకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలనూ ప్రకటించలేదు. కానీ తాజాగా మూడు ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం.
డ్రెడ్జింగ్ విధానంలో ప్రాజెక్టుల్లో పూడికను అధునాతన యంత్రాల ద్వారా నీటి నుంచి తవ్వి తీసి అందులో మెటీరియల్‌ను దేనికదిగా వేరుచేస్తారు. ఇసుకను మార్కెట్లో విక్రయిస్తారు. ఇతర సిల్ట్, మెటిరీయల్‌ను వ్యవసాయయోగ్యమైతే రైతులకు అందిస్తారు. సారవంతమైన మట్టి లేకుంటే దానిని డ్యామ్ పరిసరాలకు దూరంగా నిల్వ చేయడం, లేదంటే ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఈ విధానం ఇప్పటివరకు దేశంలో ఏ భారీ ప్రాజెక్టులోనూ అమలు చేయలేదు. రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో అమలు చేసినా అవి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకే పరిమితం.
దేశంలో తొలిసారిగా తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల్లోనే దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇరిగేషన్వర్గాల్లో ఎక్కువగా వ్యతిరేకతే వ్యక్తమవుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మూడు డ్యాముల్లోనూ ఇసుక దోపిడీ తప్ప మరేమీ లేదని చెప్తున్నారు. నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీతోపాటు అనేక ప్రాజెక్టుల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. ఆయా ప్రాజెక్టుల్లోని పూడికపై అధ్యయనాలు సైతం కొనసాగాయి. కానీ వాటన్నింటినీ కాదని ఎల్ఎండీ, ఎంఎండీ, కడెం ప్రాజెక్టులనే ఎంపిక చేయడంలో ఆంతర్యం కేవలం ఇసుక దోపిడీయేనని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎల్ఎండీ, ఎంఎండీలో ఇసుక కోసమే ఇది చేపడుతున్నారని, కడెం ప్రాజెక్టును కేవలం పేరుకే చేర్చారని తేల్చిచెప్తున్నారు.
ప్రాజెక్టుల పూడిక తీత వెనుక భారీ మంత్రాంగమే జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఓ గుజరాత్ కంపెనీకి టెండర్లను కట్టబెట్టేందుకు లోపాయికారీగా రంగం సిద్ధమైందని నొక్కిచెప్తున్నారు. పూడికతీత అంశంపై ఇటీవల నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీపరంగా ఓ నిర్ణయం తీసుకున్నారని, అందులోనే గుజరాత్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టాలని కూడా నిర్ణయించినట్టు చర్చ నడుస్తున్నది.
కాంగ్రెస్ పెద్దలు హడావుడిగా ఎలాంటి విధివిధానాలను ఖరారు చేయకుండానే ఏకంగా టెండర్లను ఆహ్వానించడం కూడా అందుకు ఊతమిస్తున్నది. మధ్యమానేరు, దిగువ మానేరు, దాని పొడువునా నిర్మించిన చెక్డ్యాముల్లో వేల కోట్ల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇంకా అనేక భారీ ప్రాజెక్టుల్లో ఇసుకతోపాటు, విలువైన మట్టి సైతం అందుబాటులో ఉన్నది. ఆ సహజ సంపదనంతా అనుయాయులకు దోచిపెట్టేందుకే పూడికతీత మాటున కాంగ్రెస్ ఇసుక దోపిడీకి తెరలేపిందని ఇంజినీర్లే చర్చించుకుంటుండడం గమనార్హం.