హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏ ప్రతిపాదికన ఇంత మొత్తంలో ఫీజులు పెంచారని.. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) వర్గాలపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీటెక్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై సర్కారు మంగళవారం సమీక్షించింది. మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టీస్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి హాజరయ్యారు.
ఒకేసారి అసాధారణంగా రూ. 50-60వేలు ఫీజులు పెంచడం.. కొన్ని కాలేజీల్లో ఏడాది ఫీజు రెండు లక్షలుండటంపై కారణాలను ఆరా తీసింది. సెయింట్ మేరిస్ సహా మరో రెండు కాలేజీల్లో ఫీజులను ఏ ప్రతిపాదికన పెంచారని, పెంచేందుకు దారితీసిన పరిస్థితులపై వివరణ అడిగింది. సర్కారు ప్రశ్నలకు టీఏఎఫ్ఆర్సీ అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మళ్లీ సమావేశం నిర్వహించేలోగా ఎంత వీలైతే అంత ఫీజులు తగ్గించాలని ఆదేశించినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.