మెడికల్ కాలేజీల్లో సమస్యల తాండవం
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
- కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాలిలో దీపంలా వైద్య విద్య
- మూడేండ్లు పూర్తవుతున్నా ‘నో’ పర్మినెంట్ బిల్డింగ్స్
- ల్యాబొరేటరీలు, టీచింగ్ ఫ్యాకల్టీలదీ అదే దుస్థితి
- అపార్ట్మెంట్లు, మార్కెట్ యార్డుల్లో మెడికల్ కాలేజీలు, హాస్టళ్ల నిర్వహణ
- మౌలిక వసతుల కల్పనలో ఫెయిల్
- రాష్ట్ర ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రంలోని ములుగు, ఖమ్మం, కామారెడ్డి, మహేశ్వరం, ఆసిఫాబాద్, నర్సంపేట, నారాయణ్ పేట, జనగామ, మెదక్, కుత్బుల్లాపూర్‌లో మౌలిక వసతులు సరిగా లేక పోవడంతో మెడికల్ స్టూడెంట్స్‌కు ఇక్కట్లు తప్పడం లేదు. కామారెడ్డి మెడికల్ కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ లేకపోవడంతో కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సరైన హాస్టల్ వసతి లేకపోవడం, హాస్టల్.. కాలేజీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అకాడమిక్ సెషన్స్, క్లినికల్ పోస్టింగ్‌లకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెస్‌కు విద్యార్థులు రూ.3,800 వర కు చెల్లిస్తున్నా.. ఫుడ్ క్వాలిటీ బాగాలేకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. క్యాంపస్ ఒక్క వాటర్ డిస్పెన్సరీ లేక మంచినీటి కోసం అవస్థలు తప్పడం లేదు.
ముగ్గురు మంత్రులున్నా..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పూర్తిస్థాయి కాలేజీ భవన నిర్మాణంలో జాప్యం.. ఆ కళాశాల ఎప్పటి వరకూ పూర్తవుతుందనే స్పష్టత కరువవడంతో వైద్య విద్య గాల్లో దీపంలా మారింది. తాత్కాలిక హాస్టల్ కొనసాగుతున్న భవనంలో మౌలిక వసతులు లేకపోవడం, కాలేజీలో కేవలం మూడు తరగతి గదులు ఉండగా.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కనీసం క్లాస్రూమ్ లేని పరిస్థితి నెలకొన్నది. ఈ కాలేజీకి బస్సు సౌకర్యం, సెంట్రల్ లైబ్రరీలో వసతులు సరిగా లేవని విద్యార్థులు చెప్తున్నారు. ఔట్‌పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చే రోగుల సంఖ్యకు తగ్గట్టు గదులు లేకపోవడంతో గంటల కొద్ది వైద్య విద్యార్థులు నిల్చోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్లేగ్రౌండ్ లేకపోవడంతో విద్యార్థులు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించుకోలేకపోవడంతోపాటు ఆటలు ఆడుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పవర్ కట్, ‘నో’ వైఫై
ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి పవర్‌కట్ సమస్య నెలకొన్నది. ఈ సమస్య ఇప్పటికీ కొనసాగడంతోపాటు మొబైల్ సిగ్నల్, వైఫై సరిగా రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్నా రు. ములుగుతోపాటు మహేశ్వరం, కు మ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నారాయణపేట, నర్సంపేట, మెదక్ కాలేజీల్లో వైద్య విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్థి స్థాయిలో అందుబాటులోకి రాని ల్యాబొరేటరీలు, తగినంత టీచింగ్ ఫ్యాకల్టీ, హాస్టళ్లలో భద్రత కరువైందని విద్యార్థులు వాపోతున్నారు. పర్మినెంట్ బిల్డింగ్లు లేకపోవడం, పలు చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు నెమ్మదిగా సాగడంతో మార్కెట్ యార్డు షెడ్డులు, అపార్ట్మెంట్లలో మెడికల్ కాలేజీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొన్నది. అనాటమీ ప్రాక్టికల్‌కు తగినన్ని శవాలు అందుబాటులో లేక విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రశ్నార్థకంగా మారింది.
ఫిర్యాదులకు స్పందన కరువు
పలు కాలేజీల్లో ప్లేగ్రౌండ్లు లేకపోవడంతో ఆటలు ఆడే పరిస్థితి లేదని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, కాలేజీలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తిప్పలు తప్పడం లేదని చెప్తున్నారు. దీంతో ప్రైవేటు రవాణా వ్యవస్థను వినియోగించడంతో ఆర్థిక భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పలు మెడికల్ కాలేజీల ఆవరణలో పాములు, తేళ్లు, కోతుల బెడద పెరిగిందని చెప్తున్నారు. పర్మినెంట్ హాస్టల్ వసతి లేకపోవడంతో పలు చోట్ల అద్దె భవనాల్లో తాత్కాలికంగా విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

