హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కార్ బీసీ వర్గాలపై వివక్షను మరోసారి బయటపెట్టుకున్నది. తాజాగా ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 3.7% నిధులనే కేటాయించి ఆ వర్గాల పట్ల తన నిర్లక్ష్యాన్ని నిరూపించుకున్నది. బీసీ సబ్‌ప్లాన్ అమలు హామీని మరోసారి తుంగలో తొక్కింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కులగణన నిర్వహిస్తామని, బీసీలకూ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని, బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లను బీసీల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుటి బడ్జెట్లో సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టనేలేదు.
కులగణన నిర్వహించడంతోపాటు, బీసీల రిజర్వేషన్ వాటాను 42 శాతానికి పెంచుతూ చట్టం చేయడంతో ఈ సారైనా సబ్‌ప్లాన్ ప్రవేశపెడతారని బీసీలు ఎంతగానో ఆశించారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం యథావిధిగా బడ్జెట్లో బీసీలకు మళ్లీ మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కోట్లలో కేవలం నామమాత్రంగా 3.7% అంటే రూ.11,405 కోట్లనే కేటాయించింది. 17% ఉన్న ఎస్సీలకు రూ.40 వేల కోట్లు, 10% ఉన్న ఎస్టీలకు రూ.17 వేల కోట్లను కేటాయించింది. 56% జనాభా ఉన్న బీసీలకు మాత్రం 3.7% నిధులనే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.