హైదరాబాద్, నవంబర్24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ కొనసాగించనున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేయడంతోపాటు, ఎన్నికల షెడ్యూల్‌ను సైతం గత సెప్టెంబర్‌లో జారీ చేసింది. జీవో 9ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, పెద్దపల్లి జిల్లా మహాముత్తారం మండలం కమ్మపల్లికి చెందిన సముద్రాల రమేశ్, సిద్దిపేట జిల్లా కొండూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ, నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన గోరటి వెంకటేశ్, ఇతరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాకే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని వికారాబాద్ జిల్లా ధరూర్‌కు చెందిన మడివాల మచ్చదేవ, రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ లక్ష్మయ్య మరో పిటిషన్ వేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం అనంతరామన్ కమిషన్ నివేదికను పట్టించుకోలేదని, బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాకే ఎన్నికలకు వెళ్లాలని పిటిషన్లో పేరొన్నారు.
ఆయా కేసుల్లో తమ వాదనలు కూడా వినాలంటూ సుమారు 30 వరకు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పిటిషన్లతోపాటు అన్ని ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణకు అనుమతిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. 2024 నాటి బీసీ జనాభా లెకలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల జనాభా లెకలకు 2011 గణాంకాలనే ప్రామాణికంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసిందని, రాజ్యాంగ అధికరణ 243-డీ ప్రకారం చట్టం లేకుండా జీవో ఇవ్వరాదని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా దానికి గవ ర్నర్ ఆమోదం లభించలేదని, ఆర్డినెన్స్ విషయంలోనూ రాజ్యాంగ అధినేత ఆమోదం లేదని, ఈ నేపథ్యంలో జీవో 9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, హైకోర్టు గత నెల ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్ల అమలును నిలిపివేసి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ కొనసాగాల్సి ఉండగా, ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో మంగళవారానికి వాయిదా పడింది.
ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తూ గెజిట్
స్థానిక సంస్థల్లో పోటీకి అడ్డంకిగా మారిన ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఇద్దరు పిల్లలున్న వారే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులు. అంతకుమించి పిల్లలుంటే అనర్హలు. 1980-1990లో జనాభా పెరుగుదల, దాని ప్రతికూల ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిబంధనను అమల్లోకి తెచ్చారని, ప్రస్తుతం జనాభా వృద్ధి రేటును దృష్టిలో పెట్టుకుని నిబంధనను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 21 (3)ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. చట్ట సవరణపై రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు, టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, ప్రధాన కార్యదర్శి గోలొండ సదానందం హర్షం వ్యక్తంచేశారు.