హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కేరళ ఎన్నికలకు మూటల కోసం కోహెడ మార్కెట్‌ను బలిపెట్టారా? ఎన్నికలకు నిధులు సమకూర్చినందుకు బదులుగా కోహెడ మార్కెట్ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదా? విలువైన, ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో కంపెనీకి కట్టబెట్టి.. కేసులు, విభజన వివాదాలు, కొండలు, రాళ్లు ఉన్న స్థలాన్ని మార్కెట్‌కు కేటాయించారా? కోహెడ పండ్ల మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయడంపై తలెత్తుతున్న ప్రశ్నలివి! వీటికి ప్రభుత్వ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
ఒకవేళ ఇవి అబద్ధాలయితే మార్కెట్‌కు పాత స్థలాన్ని రద్దు చేసి కొత్త స్థలాన్ని కేటాయించడానికి బదులుగా, కొత్త స్థలాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఎందుకు ఇవ్వలేదు? మార్కెట్‌కు స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రెండు నెలలైనా ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు ఎందుకు జారీ చేయలేదు? ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైనా ఎందుకు పనులు ప్రారంభించలేదు? ఆ భూములు కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్నాయనే విషయం ప్రభుత్వానికి ముందే తెలుసా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. రైతులకు ఉపయోగపడే స్థలాన్ని ప్రభుత్వంలోని ముఖ్యనేత తన గాడ్‌ఫాదర్ అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదిపినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక ఆరు నెలల నుంచి కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం కోహెడలో 199.128 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మార్కెట్ నిర్మాణం కోసం రూ.వెయ్యి కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు రూ.350 కోట్లు మం జూరు చేసింది. రూ.5 కోట్లు వెచ్చించి ఆ భూమిని చదును చేయించింది. రెండేండ్లుగా మార్కెట్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పడేసింది. ఆ భూమిని టీజీఐఐసీకి కేటాయిస్తూ ఫిబ్రవరి 23న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. బదులుగా మరోచోట భూమి కేటాయించింది. పాత స్థలం దాదాపు 200 ఎకరాలు కాగా, కొత్తగా 239 ఎకరాలు కేటాయించడం, పాత భూమితో పోల్చితే కొత్త భూమి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం మంచి భూమిని కేటాయించిందని అనుకున్నారు.
కానీ ఇక్కడే కుట్ర దాగి ఉన్నదనే విమర్శలున్నాయి. ప్రభు త్వం కేటాయించిన 169/1 సర్వేనంబర్‌లోని 239 ఎకరాల భూమి హౌసింగ్‌బోర్డుకు చెందినదని, అంతకు ముందు దిల్ భూమి అని అధికారు లు చెప్తున్నారు. ఈ భూములపై సుప్రీంకోర్టు వరకు కేసులున్నాయి. దిల్, హౌసింగ్ భూములపై ఏపీ, తెలంగాణ పంచాయితీ కూడా ఉన్నది. ఈ భూములు విభజన చట్టంలో భాగంగా 9వ షెడ్యూల్లో పెట్టారు. ఈ భూము లు ఎవరికీ ఇవ్వకూడదు, దేనికీ కేటాయించకూడదు. వీటన్నింటినీ పక్కనపెట్టిన ప్రభు త్వం, వివాదాల్లో ఉన్న భూమిని మార్కెట్‌కు కేటాయించింది. దీనికితోడు ప్రస్తుత భూమిలో గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. వీటిని చదును చేయడానికే రూ.15-20 కోట్లు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. అనుకూలంగా ఉన్న భూమిని లాక్కొని కోర్టు కేసులు, కొండలున్న భూమిని మార్కెట్‌కు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫండింగ్ కోసం ఆ రాష్ట్రంలోని పలు కంపెనీలతో ముఖ్యనేత అనుచరులు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో ఒప్పందం కుదిరినట్టు చర్చ జరుగుతున్న ది. కేరళలో నిధులిస్తే, బదులుగా కోహెడ మా ర్కెట్ స్థలాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ కోసం సదరు కంపెనీకి కట్టబెట్టేందుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై విమర్శలు రాకుండా తెలివిగా భూమిని టీజీఐఐసీకి కేటాయిస్తూ, మార్కెట్‌కు మరో భూమి కేటాయించినట్టు తెలిసింది.
టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని ఎగుమతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మారుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్వయంగా తెలిపారు. అంటే టీజీఐఐసీ ద్వారా ఆ భూమిని ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తారన్నమాట. తద్వారా ముఖ్యనేత ఒప్పందంలో భాగంగా కేరళకు చెందిన కంపెనీకి ఈ భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలున్నాయి.
మాజీ మంత్రి హరీశ్ కోహెడ మార్కెట్ స్థలాన్ని పరిశీలించి, దాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దీనిపై మంత్రి తుమ్మల, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి స్పందించారు. రెండు స్థలాలూ కోహెడ మార్కెట్వేనని, పాత స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు స్థలాలు కోహెడ మార్కెట్వే అయితే.. 1) పాత స్థలాన్ని కోహెడ మార్కెట్ నుంచి రద్దు చేసి టీజీఐఐసీకి అప్పగించాల్సిన అవసరం ఏమిటి?, 2) మరో చోట స్థలం ఎందుకు కేటాయించారు? 3) ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఆ స్థలాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాల్సిందే కదా? 4) అనువుగా ఉన్న స్థలాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ, ఎందుకూ పనికిరాని స్థలాన్ని కోహెడ మార్కెట్‌కు కేటాయించడం ఏమిటి? 5) ఒకవేళ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే కొత్త స్థలాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేటాయించవచ్చు కదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని టీజీఐఐసీకి కేటాయించడంతోపాటు హౌసింగ్‌బోర్డు భూమిని మార్కెట్‌కు కేటాయించాలని ఫిబ్రవరి 23న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంటే నిర్ణయం తీసుకొని దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడం గమనార్హం. భూమిని రద్దు చేస్తూ, కొత్త భూమిని కేటాయిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు. ఒకవేళ ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తే, పండ్ల మార్కెట్‌తో పాటు రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ఉత్తర్వులు జారీచేయడంతో పాటు నిర్మాణ పనులను ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పండ్ల మార్కెట్‌కు కేటాయించిన భూమి కేసులు, వివాదాల్లో ఉన్నదని, ఇది ఎప్పటికీ కోహెడ మార్కెట్‌కు సొంతం కాదనే విషయం ప్రభుత్వానికి ముందు తెలుసా? అందుకే అధికారిక ఉత్తర్వులు ఇచ్చేందుకు జంకుతున్నదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.