హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి గతంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు బీసీ కమిషన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం, రాష్ట్ర బీసీ కమిషన్ చర్యలను బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
అసలు వివాదమేంటంటే!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి మొత్తంగా ఉమ్మడి ఏపీ బీసీ జాబితాలో 156 కులాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, జాబితాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చు, లేదంటే 2 ఏండ్లలోపు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సూచించింది. అదే క్రమంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రూపొందించిన బీసీ కులాల జాబితాలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో లేని, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన దాదాపు 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించింది. 130 కులాలతో తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాను రూపొందించింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు 26 కులాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో సదరు బీసీ కులాల ప్రతినిధులు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బీసీ కులాల తొలగింపు అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ బీసీ కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీసీ కమిషన్ ఇప్పటికే ఆ 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణలు చేపట్టి అభిప్రాయ సేకరణను పూర్తిచేసింది. త్వరలోనే చేర్పునకు అనుకూల నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమైనట్టు కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉందని తెలుస్తున్నది.
వ్యతిరేకిస్తున్న కులసంఘాలు
తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనలపై, ఆ దిశగా కమిషన్ చర్యలు చేపట్టడాన్ని పలు బీసీ కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ ఏ జాబితాలోని కులాలు, సంచార కులాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే తొలగించిన కులాలను తిరిగి చేర్చాలని ప్రభుత్వం చూస్తున్నదని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ‘లక్ష లేదా రెండు లక్షలు ఉన్న ఆంధ్రా ఓట్ల కోసం తెలంగాణలోని రెండు కోట్ల జనాభా ఉన్న సామాజికవర్గాన్ని వదులుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీసీ జాబితాలో చేర్చాలని చూస్తున్న 26 కులాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నాయని వివరిస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఆయా కులాలకు చెందిన వారున్నారని చెప్తున్నారు. బీసీ కమిషన్, ప్రభుత్వం అన్యాయం చేస్తే పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.