మంచిర్యాల, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోలులో రైతులను సర్కార్ నిలువు దోపిడీ చేస్తున్నది. రైతులను ముంచి మిల్లర్లకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నది. క్వింటాకు ఏడున్నర కిలోల ధాన్యం కోత పెడుతూ రైతులను గోస పెడుతున్నది. నిబంధనల ప్రకారం బస్తా బరువుతోపాటు 40 కిలోల ధాన్యం తూకం వేయాలి. బస్తా బరువు కిలో అనుకున్నా 41 కిలోల తూకం వేయొచ్చు. కానీ మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లర్లకు మేలు చేసేలా 42 కిలోల నుంచి 43 కిలోలు తూకం పెడుతున్నారు. దీంతో ప్రతి క్వింటాపై రైతు ఏడున్నర కిలోల ధాన్యం నష్టపోవాల్సి వస్తున్నది. దీనికి ఒప్పుకొంటేనే తూకం వేస్తామని చెప్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు మౌనం వహిస్తున్నారు. తూకంలో దోపిడీతోపాటు కొనుగోలు కేంద్రాల్లో లోడ్ చేసి పంపిన లారీ మిల్లులో దిగాలంటే బస్తాకు రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఉదాహరణకు ఒక రైతు 1,000 బస్తాల ధాన్యం తూకం వేయిస్తే, బస్తాకు రూ.2 చొప్పున రూ.2 వేలు మిల్లులోని హమాలీలకు అదనంగా చెల్లిస్తున్నారు. పైసలిస్తేనే లారీ అన్లోడ్ చేస్తామని, లేకపోతే లేదని మిల్లర్లు చెప్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. కొన్ని రైస్ మిల్లుల్లో త్వరగా అన్లోడ్ చేయడానికి గుమాస్తాలు లారీకి రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దోపిడీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకుందామని వస్తే ఇన్ని రకాలుగా దోచుకుంటే ఎట్లా బతికేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే తూర్పార పట్టలేదని, తప్ప, తాలు పేరిట ఎక్కువ తూకం వేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారని, అసలు ఈ సీజన్లో తప్పతాలు తక్కువగా ఉంటుందని, నేరుగా తూకం వేసినా వచ్చే నష్టమేమీ లేదని రైతులు పేర్కొంటున్నారు.
20 రోజులు దాటినా కాంటాకెక్కని ధాన్యం
మంచిర్యాల జిల్లాలో రైతులు ధాన్యం కల్లాల్లో పోసి 20 రోజులు దాటినా తూకం వేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులను పలుకరించినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంకా కాంట పెట్టలేదంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 2.8 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 20 వేల టన్నులే సేకరించారు. రోజకు 200 లారీల చొప్పున ఈ నెలాఖరులోగా 80 శాతం పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంతో పోలిస్తే తక్కువ మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా ఈ సమయానికి 20 మిల్లులకు ట్యాగింగ్ ఇస్తే ఈసారి 10 మిల్లులకే ఇచ్చారు. ప్రభుత్వం కేవలం రా రైస్ పెట్టాలని చెప్తుండటంతో పూర్తి రారైస్ పెడితే తాము నష్టపోతామని చాలామంది మిల్లర్లు తప్పించుకు నే ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. మిల్లుల సంఖ్య తగ్గడంతో క్షేత్రస్థాయిలో ధాన్యం తరలింపుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రత్యామ్నాయంగా జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని ఆరు గోదాములకు ధాన్యం తరలిస్తున్నారు. సీఎంఆర్ బకాయిలున్నారని బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లులను సంప్రదిస్తూ.. మిల్లుల్లో బస్తాలు పెట్టుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అలా చేస్తే ధాన్యానికి రక్షణ ఉంటుందా? ఉండదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ధాన్యం సేకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి అకాల వర్షాలు తోడవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన వెంటనే కొనుగోలు చేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని.. సర్కార్ నిర్లక్ష్యంతో నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
రూ.2,400 ఫోన్‌పే చేసిన
నేను 30 ఎకరాలు కౌలు తీసుకొని వరి పండించిన. రోజుల తరబడి ఎదురు చూస్తే, నిన్న కాంట పెట్టిన్రు. 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నరు. మొత్తం 2,100 బస్తాల ధాన్యం కాగా 1,200 బస్తాల ధాన్యం లారీలో మిల్లుకు తీసుకెళ్లిన్రు. ఈ 1,200 బస్తాలకు గాను బస్తాకు రూ.2 చొప్పున ఇస్తేనే అన్లోడ్ చేస్తామంటున్నరు. ఇప్పుడే రూ.2,400 ఫోన్ పే చేసిన. తూకం వేసినందుకు హమాలీలకు క్వింటాకు రూ.60 చొప్పున ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్నది. కానీ ఈ సారి లారీ అన్లోడ్ చేసేందుకు మిల్లుల్లోని హమాలీల కోసం అదనంగా వసూలు చేస్తున్నరు.
– కొండగొర్ల అనిల్, రైతు, పెద్దంపేట
కాంటా పెట్టలేదు..
ఐదెకరాల్లో పండించిన ధాన్యం గుడిపేట కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులైంది. ఈ రోజు నా ధాన్యం తూకం వేస్తున్నారు. మొన్న పడిన వర్షాలకు ధాన్యానికి మొలకలు వచ్చాయి. చాలావరకు వేస్టేజీ పోయింది. మూడు కుప్పల్లో ఓ కుప్ప పూర్తిగా తడిసి ముద్దయ్యింది. రాగానే తూకం వేసి ఉంటే మొన్నటి వర్షానికి నా పంట తడిసేది కాదు. 42 కిలోల 200 గ్రాములు చొప్పున తూకం వేస్తున్నారు. ఏదేమైనా ధాన్యం పోవడం ముఖ్యమని ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితులు చూడలేదు.
– కారుకురి రాజమౌళి, రైతు, నంనూర్