హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్సెస్సీ, ఇంటర్బోర్డుల విలీనంపై సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో రెండు బోర్డులను విలీనం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రెండు బోర్డుల విలీనమంటే విద్యావ్యవస్థను దశాబ్దాలు వెనక్కి నెట్టడమే అవుతుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ మొండిగా ముందుకెళితే కోర్టుకు వెళుతామంటూ హెచ్చరిస్తున్నారు.
నాణ్యమైన చదువులకు ఇంటర్ విద్య కేరాఫ్. కేరళ సహా అనేక రాష్ర్టాల్లో ఇంటర్ బోర్డు సక్సెస్‌కు చిహ్నం. ఇంటర్‌బోర్డుకు మరణశాసనం రాయడాన్ని మేం అంగీకరించం. ఏ, బీ, సీ, డీలు తెలియని వారు చెబితే ఇంటర్ బోర్డును రద్దు చేస్తారా? ఇది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే చర్య. రాజస్థాన్‌లోని కోటా విద్యాసంస్థల్లా మన విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తప్పుదోవ పట్టిస్తున్నరు. ఇంటర్ బోర్డు పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధం.- మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ